కరోనా మహమ్మారి పుణ్యమా అని గత ఏడాది కాలంలో సినిమాను చూసే తీరే మారిపోయింది.
కొత్త సినిమా విడుదలైన కొన్ని వారాల్లో ఓటీటీల్లో వచ్చేస్తుంటేనే ఆశ్చర్యపోతూ ఉన్న వాళ్లం.. నేరుగా ఓటీటీలో సినిమాలు రిలీజ్ కావడాన్ని చాలా మామూలుగా చూసే పరిస్థితికి వచ్చేశాం.
కరోనా వల్ల సినిమాలకు సంబంధించి అన్ని బిజినెస్‌లూ దెబ్బ తిన్నాయి కానీ.. ఓటీటీలు మాత్రం భలేగా పుంజుకున్నాయి.
మునుపెన్నడూ లేని స్థాయిలో అనూహ్యంగా సబ్స్క్రైబర్లను పెంచుకుని వ్యాపారాన్ని విస్తరించాయి.
‘ఆహా’ సహా ఎన్నో కొత్త ఓటీటీలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ఉన్న ఓటీటీలు.. కొత్తవి వాటి విస్తరణ కోసం కొత్త చిత్రాలను కొని నేరుగా రిలీజ్ చేయడం మొదలుపెట్టాయి. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో చిచ్చు రేపుతోంది.
ఓటీటీ నిర్వాహకులు.. నిర్మాతలు.. ఎగ్జిబిటర్లు ఎవరి మనుగడ కోసం వాళ్లు బలమైన వాదన వినిపిస్తుండగా.. కొత్త సినిమాల ఓటీటీ విడుదల విషయంలో వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.
సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్లు మూతపడి.. రెండు నెలల తర్వాత కూా అవి పున:ప్రారంభం కాకపోవడం, ఇప్పుడిప్పుడే పరిస్థితులు బాగుపడేలా కనిపించకపోవడంతో తన నిర్మాణంలో తెరకెక్కిన నారప్ప, దృశ్యం-2, విరాటపర్వం చిత్రాలను అగ్ర నిర్మాత సురేష్ బాబు డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు అమ్మేయడం ఇండస్ట్రీలో దుమారం రేపింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వయంగా పదుల సంఖ్యలో థియేటర్లను నడిపించే సురేష్ బాబు.. ఆ రంగం కుదేలవుతుంటే పట్టించుకోకుండా తన సినిమాలను ఓటీటీలకు ఇచ్చేయడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి.
పై మూడు చిత్రాల్లో ‘నారప్ప’ డిజిటల్లో రిలీజైపోయింది . అమేజాన్ ప్రైమ్‌లో జులై 20న ఈ చిత్రం విడుదలైంది.
మిగతా సినిమాలకు సంబంధించి కూడా డీల్స్ పూర్తయ్యాయని అంటున్నారు.
ఐతే వీటి గురించి సురేష్ బాబు అధికారిక ప్రకటన చేయడానికి భయపడుతున్నారు. ‘నారప్ప’ రిలీజ్ గురించి కూడా ఆయన స్పందించలేదు.
ప్రైమ్ వాళ్లే ప్రకటన ఇచ్చి విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సురేష్ బాబు తన లాభం చూసుకున్నారు తప్ప.. ఏడాదిగా కరోనా దెబ్బకు దారుణంగా దెబ్బ తిన్న థియేటర్ ఇండస్ట్రీ మనుగడ గురించి ఆలోచించలేదని.. మిగతా నిర్మాతలు కూడా ఇలాగే ఆలోచిస్తే.. రేప్పొద్దున థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఏం సినిమాలు ఉంటాయి.. ఓటీటీలో కొత్త సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు థియేటర్లకు ఎక్కడ వస్తారు అన్నది ఎగ్జిబిటర్ల వాదన.
గత ఏడాది కరోనా మొదలైన కొత్తలో కొత్త చిత్రాలను ఓటీటీలకు ఇస్తుండటం మీద అభ్యంతరాలు తెలిపారు ఎగ్జిబిటర్లు. ఐతే ఎంతకీ థియేటర్లు తెరుచుకోకపోవడంతో వి, నిశ్శబ్దం లాంటి పేరున్న సినిమాలను ఓటీటీల్లోనే రిలీజ్ చేశారు.
తమిళనాడులో కూడా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఓటీటీ రిలీజ్‌ల విషయంలో పెద్ద గొడవే నడిచింది. ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. తాజాగా టాలీవుడ్లో ఎగ్జిబిటర్లందరూ సమావేశమై.. నిర్మాతలు కొత్త సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్టోబరు వరకు ఆగాలని, ఆలోపు థియేటర్లు తెరుచుకుని మునుపటిలా నడవకపోతే ఓటీటీ బాట పట్టొచ్చని అన్నారు. తమ మాట వినకుండా తీవ్ర నిర్ణయాలు తప్పవని కూడా హెచ్చరించారు. కరోనా దెబ్బకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లు మూతపడ్డాయి.
థియేటర్లను ఖాళీగా పెట్టుకుని మెయింటైన్ చేయలేక, అద్దెలు, కరెంటు బిల్లులు కట్టలేక వాటిని మూత వేసేసి వేరే పనులకు వాడుకుంటున్నారు. థియేటర్లను కొట్టేసి రియల్ ఎస్టేట్, కమర్షియల్ అవసరాలకు వాడుకుంటే ఎక్కువ ప్రయోజనం దక్కుతుందని.. నిర్మాతల తీరు మారకుంటే అదే చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఐతే ఎగ్జిబిటర్లు ఇలా హెచ్చరికలు జారీ చేసినా సురేష్ బాబు తగ్గలేదు. కొన్ని రోజులకే ‘నారప్ప’ డిజిటల్ రిలీజ్ గురించి సమాచారం బయటికి వచ్చింది. దీంతో ఎగ్జిబిటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మరిందరు నిర్మాతలు ఇదే బాట పడితే.. ఎగ్జిబిటర్లు తీవ్ర నిర్ణయాలే తీసుకునేలా ఉన్నారు.
నిర్మాతల వాదనేంటి?
వందలు వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఓటీటీలను నడిపిస్తున్న వాళ్లు.. సబ్స్క్రైబర్లను నిలబెట్టుకోవడానికి, కొత్త వాళ్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కంటెంట్ అందించాల్సిందే.
అది కొత్తదైైతేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఒక కొత్త సినిమాను రిలీజ్ చేస్తుంటే ఆటోమేటిగ్గా కొత్త సబ్స్క్రిప్షన్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో వస్తాయి. అందుకే కొత్త చిత్రాల మీద భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఓటీటీల వైపు నుంచి చూస్తే వాళ్ల ఆలోచనలో తప్పేమీ కనిపించదు. ఐతే థియేటర్ల యజమానుల వాదనేంటో తెలిసిందే.
మరి నిర్మాతలు ఏమంటున్నారన్నది ఇప్పుడు కీలకం. కోట్లు పెట్టి సినిమా తీస్తే దాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాత హక్కు అని, తనకు ఏది ఎక్కువ ప్రయోజనకరం అనిపిస్తే నిర్మాత అదే చేస్తాడని.. వారిని ఎగ్జిబిటర్లు అడ్డుకోలేరని అంటున్నారు ఇండస్ల్రీ జనాలు. నెలలకు నెలలు సినిమాను ఆపుకోవడం వల్ల పడే వడ్డీల భారాన్ని ఎగ్జిబిటర్లు భరిస్తారా..రేప్పొద్దున థియేటర్లలో ఆశించిన వసూళ్లు రాక నష్టపోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.
అంతే కాక మామూలు రోజుల్లో తమ చిత్రాలకు సరిపడా థియేటర్లు దొరక్క నిర్మాతలు అవస్థలు పడ్డపుడు ఎగ్జిబిటర్లు ఏం ఆదుకున్నారు.. థియేటర్లు దొరక్క ఎన్ని సినిమాలు నెలల తరబడి విడుదలకు నోచుకోకుండా ఆగిపోలేదు అని వాదిస్తున్నారు.
రేప్పొద్దున థియేటర్లు మునుపటి స్థాయిలో నడవడం మొదలయ్యాక స్క్రీన్లు దొరక్క నిర్మాతలు ఇబ్బంది పడటం మామూలే అని.. అలాంటపుడు కొత్త చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడం గురించి అభ్యంతర పెట్టడం.. హెచ్చరికలు జారీ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. కాబట్టి ఎవరి వాదననూ తప్పుబట్టలేం. ఎవరూ రైట్ అని కూడా అనలేం. పరిస్థితులను బట్టి అందరూ సర్దుకుపోవాల్సిందే.
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పెద్దగా లేకపోతే.. త్వరలోనే థియేటర్లు తెరుచుకుని పూర్తి స్థాయిలో నడిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పుడు ఎవరి ఛాయిస్‌కు తగ్గట్లుగా వాళ్లు సినిమాలను రిలీజ్ చేసుకుంటారు.