ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ పొలిటిషన్, నందమూరి తారక రామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఇంకొల్లులో నిర్వహించిన సందర్భంగా దగ్గుబాటి ఈ ప్రకటన చేశారు.
తనతో పాటు తన కుమారుడు హితేష్ కూడా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా దగ్గుబాటి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొల్లుతో తనకు చాలా అనుబంధం ఉందని, ఆ కారణంతోనే ఈ ప్రకటనను ఇక్కడి నుంచి చేస్తున్నానని దగ్గుబాటి అన్నారు. అయితే, గతంలో రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు పొంతనలేదని, డబ్బుతో రాజకీయం చేయడం కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదని ఆయన అన్నారు. ఆ కారణంతోనే రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టుగా వెల్లడించారు.
పర్చూరు నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోక్ సభ, రాజ్యసభకు కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ నేతగా చాలా కాలం కొనసాగిన వెంకటేశ్వరరావు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. టిడిపి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో దగ్గుబాటి ఓటమి పాలయ్యారు.