మారుతున్న గొంతుక.. మారుతున్న నాయకురాలు అని అనేందుకు సాక్ష్యం మరియు తార్కాణం అన్న గారి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి . మొన్నటి వేళ ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఎన్నో విషయాలు చెప్పారు. ఆసక్తికరంగా తన మద్దతు చినబాబుకు ఉంటుందని కూడా అన్నారు. తన దీవెనలతో ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాని కూడా చెప్పారు.
ఓ విధంగా ఏనాటి నుంచో ఉన్న విభేదాలు అన్నింటినీ ఇవాళ సమసిపోయే సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ఆమె తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. చిన బాబు లోకేశ్ కు మద్దతుగా నిలుస్తున్నారన్న మాట కూడా నిజం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓ విధంగా కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఊరటనిచ్చే పరిణామం.
ఇక చిన్నమ్మగా పేరున్న పురంధేశ్వరి రెండు జాతీయ పార్టీలలోనూ నేతగా ఎదిగారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు, బీజేపీ హయాంలో కూడా మంచిగానే రాణించారు. ఎన్టీఆర్ వారసురాలు అని అనిపించుకునేందుకు గొప్ప వాగ్ధాటి అయితే పొంది ఉన్నారు. సొంతం చేసుకున్నారు. మహిళా మోర్చాకు నేతృత్వం వహిస్తూ ఆయా సందర్భాల్లో సంబంధిత శ్రేణులను ఎంతగానో ఉత్సాహపరిచారు. చంద్రబాబుతో ఉన్న విభేదాలు అవశేషాంధ్రలోనూ కొనసాగించారు. సంబంధిత సందర్భాలో ఆమె కొన్ని విషయాలను తెరపైకి తెస్తూ ముక్కుసూటిగానే ప్రశ్నించారు.
ఏ విధంగా చూసుకున్నా అన్న గారి కొడుకులు కన్నా ఆమె రాజకీయంగా ఎంతో పరిణితి ఉన్న నేత అని అనిపించుకున్నారు. రెండు జాతీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల ప్రశంసలు అందుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఎంతగానో కృషి చేసి సఫలీకృతం అయ్యారు. ఆ రోజు చంద్రబాబు కన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న పురంధేశ్వరి చూపిన చొరవే ఎక్కువ అన్నది కాదనలేని వాస్తవం.
చాలా కాలం తరువాత రాజకీయ వైరుధ్యాలను వదలి ఆమె ఇప్పుడిప్పుడే నారా వారి కుటుంబానికి దగ్గరవుతున్నారు. అదేవిధంగా ఆమె కుమారుడు హితేశ్ ను టీడీపీలో చేర్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తోంది. లోకేశ్ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు తార్కాణం అని ప్రధాన మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. త్వరలో నారా కుటుంబం, దగ్గుబాటి కుటుంబం ఒకే గూటిలో నిలిచి రాజకీయం చేయడం ఖాయం అని ఓ ప్రాథమిక వివరం.