అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎంత అణుకువగా ఉంటే అంత మంచిదన్న చిన్న విషయాన్ని మర్చిపోయి.. తమకు మించిన తోపులు మరెవరూ లేరన్నట్లుగా వ్యవహరించే నేతలు కొందరు ఉంటారు. విషయాన్ని విషయంగా అర్థం చేసుకోకుండా.. అనుచిత వ్యాఖ్యలు చేసే మైండ్ సెట్ కొందరికి ఉంటుంది. భౌతికంగా తమ చెంతన లేని వ్యక్తి గురించి.. వారి వ్యక్తిత్వం గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం కొందరికు సాధ్యం. ఇప్పుడు ఆ కోవలోకి వస్తారు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా.
స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరుతో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరుకు బదులుగా వైఎస్సార్ పేరును మార్చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. దీనిపై పెద్ద ఎత్తున రభస చోటు చేసుకోవటం.. దీనికి కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఆ పార్టీకే చెందిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సైతం తన భర్త పేరును మార్చటం పెద్ద విషయంగా తాను భావించటం లేదన్న మాట వినిపించినప్పుడు.. అయ్యో ఎన్టీఆర్ అనుకోకుండా ఉండలేని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తన నోటికి పని చెప్పారు.ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగానే కాదు.. ఎన్టీఆర్ ను అభిమానించే కోట్లాది మంది ఆయన మాటలకు విస్తుపోయి.. ఇదెక్కడి ‘దాడి’? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాకినాడ జిల్లా తొండంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దేశం మొత్తమ్మీదా ఎన్టీఆర్ అంత చేతకానివాడు ఎవరూ ఉండరన్నారు. ‘ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఆయన గుప్పిట్లో ఉంది. మంత్రివర్గ సభ్యుడైన నాదెండ్ల భాస్కర్ రావుతో ఒకసారి.. సొంత అల్లుడు చంద్రబాబు చేతిలో మరోసారి వెన్నుపోటు పొడిపించుకున్నారు. అందుకే ఎన్టీఆర్ ను చేతకానివాడిగా అభివర్ణించాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’ అంటూ నోటికి వచ్చినట్లుగా చేసిన వ్యాఖ్యలపై మండిపాటు వ్యక్తమవుతోంది.
ఎన్టీఆర్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పోలికే లేదని.. వైఎస్ ప్రజల మనిషి అంటూ మరో దారుణ వ్యాఖ్యలు చేశారు. ఇక.. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలని కోరుతూ.. రైతులు చేస్తున్న పాదయాత్రపైనా తనదైన వ్యాఖ్యలు చేశారు దాడిశెట్టి. అమరావతి స్థిరాస్తి వ్యాపార మేళం ప్రతి నియోజకవర్గంలో అమరావతి రైతుల రూపంలో తిరుగుతోందని.. వీరంతా వ్యంగ్యంగా నాట్యం చేస్తూ.. తొడలు కొడుతున్నారన్నారు. అధికారం ఉంది కదా.. మనసుకు అనిపించినట్లుగా మాట్లాడటం వల్ల లాభం కంటే చేటే ఎక్కువగా ఉంటుందన్న విషయం దాడిశెట్టి రాజాకు ఎప్పటికి అనుభవంలోకి వస్తుందో చూడాలి.