బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మంచి జోరు మీద ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి `డాకు మహారాజ్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా.. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా తదితరులు ముఖ్య పాత్రల్లో నటింటారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా టెక్సాస్ ట్రస్ట్ థియేటర్ వేదికగా డాకు మహారాజ్ ట్రైలర్ ను చిత్రబృందం లాంచ్ చేసింది. యాక్షన్ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మూడు డిఫరెంట్ గెటప్స్ లో బాలయ్య మాస్ ర్యాంపేజ్ సృష్టించారు. ట్రైలర్ లో బాలయ్య ఒక్క డైలాగ్ లేకపోయినా.. కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ ఆయన క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేలా ఉంది.
`అనగనగా ఒక రాజు ఉండేవాడు.. చెడ్డవాళ్లంతా ఆయన్ను డాకు అనేవాళ్లు.. మాకు మాత్రం మహారాజు..` అంటూ ప్రారంభమైన ట్రైలర్ చాలా ఫ్రెష్ గా కొత్తగా ఉంది. బాబీ డియోల్ పోషించిన ప్రతినాయకుడి పాత్రను కూడా బాబీ చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడు. బాలయ్య లుక్స్, యాక్షన్ సన్నివేశాలు, పాప సెంటిమెంట్, కామెడీ టచ్, తమన్ బిజీఎమ్ ట్రైలర్ లో హైలెట్గా నిలిచాయి. నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల నుంచి కూడా ట్రైలర్ కు విశేషమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి మొగుడు.. మొనగాడు బాలయ్యే, బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.