దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో నివసించే వారికి డీ మార్ట్ సుపరిచితమే. దేశంలోని అతి పెద్ద రిటైల్ సరుకుల చెయిన్ మాల్స్ ను నిర్వహిస్తోన్న దిగ్గజ సంస్థ డీ మార్ట్. మార్కెట్ లో ఉన్న ఇతర మాల్స్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు, ఇతర ఉత్పత్తులను తక్కువ ధరకే అందించే ఈ సంస్థ కోట్లాదిమంది వినియోగదారులను ఆకట్టుకుంది. మధ్య తరగతి వారు సైతం డీ మార్ట్ లో షాపిింగ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు.
ఇక, కరోనా సమయంలోనూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినియోగదారులకు సరుకులు అందించింది డీ మార్ట్. అందుకే, కరోనా సమయంలో అత్యధిక లాభాలు గడించిన సంస్థల్లో డీమార్డ్ టాప్ ప్లేస్ లో ఉంది. ఈ రకంగా తన వ్యాపారాన్ని విస్తరించుకున్న డీ మార్ట్ మార్కెట్లోని ఇతర సంస్థలతో పోలిస్తే కరోనా టైంలో అనేక రెట్లు లాభాలు గడించింది. ఈ నేపథ్యంలోనే డీ మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీకి అరుదైన గౌరవం దక్కింది.
ప్రపంచంలోని టాప్ 100 కుబేరుల జాబితాలో దమానీకి చోటు దక్కింది. ప్రముఖ ఆర్థిక సర్వే సంస్థ బ్లూమ్ బర్గ్ ప్రకటించిన బిలియనీర్స్ జాబితాలో దమానీ 98వ స్థానంలో నిలిచారు. దమానీ నికర సంపద రూ.1,38,000 కోట్లు(19.2 బిలియన్ డాలర్లు)గా బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. ఇప్పటికే ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల జాబితా టాప్ టెన్ లో భారత్ నుంచి ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అజీమ్ ప్రేమ్ జీ, పల్లోంజీ మిస్త్రీ, శివ నాడార్, లక్ష్మీ మిట్టల్ ఉన్న సంగతి తెలిసిందే.