సైబర్ మోసాలకు సామాన్యుడు, ప్రజాప్రతినిధులనే తేడా లేదు. సైబర్ మోసగాడు తెలివైనవాడైతే చాలు అవతలి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మోసపోక తప్పదు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఒక సైబర్ మోసగాడు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ను ఇలాగే బురిడీ కొట్టించాడు కాబట్టి. తన మోసంతో ఎంపీ ఖాతాలోని సుమారు రు. లక్ష రూపాయలను ఇట్టే లాగేసుకున్నాడు. తర్వాత విషయం తెలుసుకున్న ఎంపీ పోలీసుస్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేశారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఎంపీ బాగా బిజీగా ఉన్న సమయంలో ఒక ఫోన్ వచ్చింది. బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యిందని పాన్ నెంబరుతో వెంటనే అన్ బ్లాక్ చేసుకోవాలని కోరుతు ఒక మొబైల్ నెంబర్ నుంచి ఎంపీ మొబైల్ కు ఎస్ఎంఎస్ వచ్చింది. ఆ ఎస్ఎంఎస్ తో పాటు వెంటనే ఒక లింక్ కూడా వచ్చింది. తన అకౌంట్ నెంబర్ బ్లాక్ అయిన విషయం నిజమే అనుకున్న ఎంపీ వెంటనే లింకును ఓపెన్ చేశారు. లింకులో అడిగిన వివరాలన్నింటినీ చక్కగా ఫీడ్ చేశారు.
లింక్ ఫీడ్ చేసి పంపిన కాసేపటికి ఒక వ్యక్తి ఫోన్ చేసి హెచ్డీఎఫ్సి బ్యాంకు కస్టమర్ కేర్ నుండి ఫోన్ చేస్తున్నట్లుగా పరిచయం చేసుకుని మాట్లాడారు. ఎంపీ మాట్లాడి సదరు వ్యక్తి అడిగిన ఖాతా నెంబర్ వివరాలు, మొబైల్ కు వచ్చిన ఓటీపీ నెంబర్ అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే ఖాతా అన్ బ్లాక్ అవుతుందని చెప్పి ఫోన్ కట్ చేశారు. అలాగే సీన్ కట్ చేస్తే కాసేపటికి ఎంపీ మొబైల్ నెంబర్ కు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది.
అదేమిటయ్యా అంటే ఎంపీ ఖాతా నుండి రు. 48 వేల చిల్లర కట్ అయినట్లు. తన ఖాతా నుండి ఎందుకు అంత ఎమౌంట్ కట్ అయ్యిందో ఎంపీకి అర్థం కాలేదు. అదే విషయాన్ని ఆలోచిస్తుండగానే రెండోసారి ఇంకో ఎస్ఎంఎస్ వచ్చింది. ఇదేంటని చూస్తే మరో రు. 48 వేల చిల్లర కట్ అయినట్లుంది. అంటే రెండు విడుతలుగా ఎంపీ ఖాతా నుండి సుమారు 97 వేల రూపాయలు కట్ అయిపోయింది. అప్పుడు ఎంపీకి బల్బు వెలిగింది. తనను ఎవరో మోసం చేశారని అర్దం చేసుకున్న సంజీవ్ కుమార్ వెంటన పోలీసుస్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేశారు.