జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అయిన వైనం సంచలనం రేపింది. గత ఏడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్ర సందర్భంగా వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఐపిసి సెక్షన్ 499, 500 కింద పవన్ పై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసింది. నాలుగో అదనపు జిల్లా కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తూ గుంటూరు జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మార్చి 25న విచారణకు హాజరు కావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు…పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, ప్రచార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని, ఆ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీసి ప్రభుత్వంపై బురదజల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పవన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలాలను ఫిర్యాదుకు జత చేసింది.