హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన స్థలాలు ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా బంజారాహిల్స్ అన్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వివాదంలో ఉన్న భూమిలో వైన్ షాప్ ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఈ వైన్ షాపును ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ భూమిపై కోర్టు వివాదం ఉంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3లో ప్లాట్ నెంబరు 8(డీ)లో 2.2 ఎకరాల భూమి ఉంది. దీనిపై ప్రభుత్వానికి.. షౌఖతున్నీసా బేగం మధ్య కోర్టు వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే.. 2006లో అపెక్స్ కోర్టు షౌఖతున్నీసాకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అయితే.. ఈ స్థలానికి అనుకొని ఉన్న 2175 గజాల స్థలం తమదేనని మాజీ ఎమ్మెల్యే కందాల (అప్పట్లో ఎమ్మెల్యే).. దీప్తి ఎవెన్యూ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఆక్రమించే యత్నం చేశారన్నది ఆరోపణ.
ఈ భూమి ప్లాట్ నెంబరు 8(సీ) కిందకు వస్తుందన్నది కందాల వాదన. అయితే.. ప్రభుత్వ అధికారులు మాత్రం స్థలంలో ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై కందాల కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్టేటస్ కో ఇచ్చింది. అయితే.. కోర్టు నిబంధనల్ని ఉల్లంఘించి పదిహేను రోజుల క్రితం అక్కడ షెడ్లు నిర్మించి.. వైన్ షాప్ ఏర్పాటు చేయటంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో.. క్రిమినల్ కేసును పోలీసులు నమోదు చేశారు.