సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అమరావతిపై విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి కోసం రైతులంతా పచ్చని పంట పొలాలను త్యాగం చేస్తే…చివరకు ఆ భూములను వైసీపీ నేతలు తమ పార్టీ మైలేజీ కోసం వాడుకుంటున్న వైనంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెబుతూ…అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతిలో పేదలకు పట్టాలు, స్థలాలు కేటాయించాలని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ కు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు లేఖలు రాశారు. దీంతో, వారు అడిగిన 1134.58 ఎకరాల భూమికి అదనంగా ఎస్3 జోన్ లో 268 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివేక్ యాదవ్ వెల్లడించారు. ఎకరం 24.6 లక్షల చొప్పున 268 ఎకరాలను ప్రభుత్వానికి అమ్మేయడానికి వివేక్ సంతకం కూడా పెట్టేశారు.
వాస్తవానికి అమరావతి ఆర్-5 జోన్ లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో రైతులు పిటిషన్ వేయగా.. స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అమరావతి రైతులు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కానీ, ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం రెడీ అయింది.
వాస్తవానికి, ఎస్3 జోన్ లో ఎకరం భూమి విలువ రూ.4.3 కోట్లు. కానీ, ఇపుడు దాని ధర 24.6 లక్షలకు పడిపోయింది. దీంతో, వివేక్ యాదవ్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. జగన్ ఏరికోరి వివేక్ యాదవ్ ను సీఆర్డీఏ ఛైర్మన్ గా నియమించారని, అందుకే ఆయన స్వామి భక్తిని చాటుకునేందుకు నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని పాతిక లక్షలకే ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.