ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ప్రశ్నిస్తే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసింది. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు… హైకోర్టు తీర్పునిచ్చిన ఆరు నెలల తర్వాత ఆ తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధానిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ బట్టు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తన కుమార్తె ఢిల్లీలో చదువుతోందని, అక్కడ ఆమె స్నేహితులు ఏపీ రాజధాని ఏదంటూ ఆమెను ఆటపట్టిస్తున్నారని దేవానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితి ఉండటం విచారకరమని జస్టిస్ దేవానంద్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యలపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు.
జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని అంశంపై జగన్ ప్రభుత్వం పదేపదే వివాదాలు రేపుతోందని, దేశవ్యాప్తంగా ఏపీ పరువును జగన్ మంటగలుపుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయకపోవడం జగన్ నిరంకుశత్వానికి నిదర్శనం అని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరిచి అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి రైతుల పాదయాత్రను విరమింపజేయాలని ఆయన కోరారు.