అమరావతి టు అరసవెల్లి పేరుతో అమరావతి పరిరక్షణ సమితి చేపట్టదలచిన మహా పాదయాత్రకు జగన్ సర్కార్ అన్ని రకాలుగా అడ్డంగులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకోవడం చర్చనీయాంశం అయింది. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో చేసేదేమీ లేక చివరకు పాదయాత్రను విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ పాదయాత్ర ఉత్తరాంధ్ర పై దండయాత్ర అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్లు చేశారు. అమరావతి దెయ్యాల రాజధాని అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే వైసీపీ మంత్రుల వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విశాఖను ధ్వంసం చేస్తున్నది వైసీపీ మంత్రులేనని ఆయన దుయ్యబట్టారు. విశాఖ రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదని, పోర్టు, ఉక్కు పరిశ్రమ వచ్చిన తర్వాతే నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని రామకృష్ణ చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంటే వైసీపీ నేతలు ఏం చేశారని రామకృష్ణ ప్రశ్నించారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రపై మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలూ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటున్నారని, అటువంటి ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం తగదని వైసిపి నేతలకు సూచించారు. హైకోర్టు విచారణతో అమరావతి రాజధాని అంశం ముగిసిందని అందరూ భావించామని, కానీ, తాజాగా మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. జగన్ మేనమామ కుమారుడు లేపాక్షి భూములను కొంటున్నాడని… ఆ భూములను తక్షణమే రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.