ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నా.. సీఎం జగన్ పై గెలవాలన్నా.. తన దగ్గర కీలక సూత్రం ఉందని అంటున్నారు కామ్రెడ్ కురు వృద్ధుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఉరఫ్ చికెన్ నారాయణ. ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏకాకులుగా ఉన్నాయని చెబుతున్న ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే.. అన్ని పార్టీలూ చేతులు కలిపి.. రోడ్డెక్కాలని సలహాలు ఇస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. దీనిపైనే కొన్ని గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇక, మిగిలిన పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగితే.. కామ్రెడ్ చెప్పింది చేస్తే.. ఏం జరుగుతుందో.
ఇక, తనదైన శైలిలో మాట్లాడుతూ.. ఏపీలో పార్టీలు అన్నీ కేంద్ర హోంమంత్రిని, బీజేపీని చూసి భయపడుతున్నాయని నారాయణ అన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, జగన్ను ఎదుర్కోవాలంటే.. ఆయనపై గెలవాలంటే.. ఏపీలో అన్ని పార్టీలు కలవాలని ఆయన సూచించారు. మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తారో అని వారంతా భయపడుతున్నారని, ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే మా పొత్తులు ఉంటాయని నారాయణ స్పష్టం చేశారు.
మరోవైపు ఆయన యధావిధిగా బీజేపీపైనా విమర్శలు గుప్పించారు. బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయన్నారు. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదని, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయేనని నారాయణ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీతో ఎవరైనా పొత్తులు పెట్టుకుంటే.. ఆ పార్టీలకు కూడా ఓటేయరని వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. “జగన్కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్ళాలి అన్నది మా ఉద్దేశం“ అని మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. అదేసమయంలో టీడీపీని కూడా `ఇండియా` కూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. మొత్తానికి బీజేపీ, వైసీపీ యేతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న విషయాన్ని అటు ఇటు తిప్పి చాలా చక్కగా వివరించారు. ఇదీ సంగతి!