అమరావతి టు అరసవిల్లి పేరుతో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, అమరావతి రైతుల ఉద్యమాన్ని అడ్డుకునేందుకు వైసిపి నేతలు అడుగడుగునా విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అమరావతి పాదయాత్రపై మాటలతో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలు ఇప్పుడు చేతలకు దిగుతున్నారు.
పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక పాదయాత్రకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని ఐతంపూడి వద్ద పాదయాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్న ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమరావతి వద్దు అంటూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు చూపిస్తూ రైతులను రెచ్చగొట్టిన వైనం చర్చనీయాంశమైంది.
వైసిపి నాయకులు పాదయాత్ర చేస్తున్న రైతులను కవ్విస్తున్నారని, ఆ సమయంలో రైతులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ వర్గీయులను తమపై ఉసిగొల్పేలా ప్రవర్తించిన తణుకు రూరల్ ఎస్సై ఆంజనేయులుపై ప్రైవేటు కేసు వేస్తామని వారు చెప్తున్నారు.
మరోవైపు అమరావతి పాదయాత్రకు మద్దతుగా సిపిఐ నారాయణ కదం తొక్కారు. రైతుల పాదయాత్రలో పాల్గొన్న నారాయణ అనంతరం జగన్ పై విరుచుకుపడ్డారు. రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకుంటే వైసిపి నేతల గుట్టు రట్టవుతుందని, అందుకే ఈ యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని నారాయణ ఆరోపించారు. రుషికొండతోపాటు విశాఖలో విలువైన భూములను కొట్టేయడమే వైసిపి నేతల లక్ష్యం అని సంచలన ఆరోపణలు చేశారు.
రుషికొండను సందర్శించేందుకు కోర్టు అనుమతిచ్చినా తనకు ఇప్పటిదాకా పోలీసుల, ప్రభుత్వం అనుమతి లభించలేదని నారాయణ మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రను వైసిపి నేతలు అడ్డుకోవడం అడ్డంకులు సృష్టించడం సరికాదని అన్నారు.