జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు గతంలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పవన్ కు రాజకీయ పరిపక్వత లేదని, ఆయనో పార్ట్ టైం పొలిటిషియన్ అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తుంటారు. పవన్ కు ఆవేశం ఎక్కువని…ఆలోచన తక్కువని విమర్శిస్తుంటారు. ఇక, జనసేనకు కేడరే లేదని, అటువంటి పవన్ సీఎం కావాలని పగటి కలలు కంటుంటారని ఎద్దేవా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ పై మరో విపక్ష నేత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పవన్ పై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం పవన్ చేస్తున్న పోరాటంపై తనకు నమ్మకం లేదంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి. 222 రోజులుగా విశాఖ ఉక్కు కోసం మహా ఉద్యమం జరుగుతుంటే పవన్ కు ఇప్పటివరకు కనిపించలేదా అని నారాయణ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీలో జరిగిన ఆందోళనకు అధికార పార్టీ వైసీపీ వచ్చిందని, కానీ జనసేన రాలేదని విమర్శించారు.
ఢిల్లీలో పవన్ కు పలుకుబడి ఉంది అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారని నారాయణ ప్రశ్నించారు. అక్కడకు వెళ్లి కాళ్ళుపట్టుకుని ఇక్కడ మీసం తిప్పుతావా… ఇక్కడమో బీజేపీతో గుద్దులాట…..అక్కడేమో ముద్దులాటనా అని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రజలకు నమ్మకద్రోహం చేయవద్దని, చేతకాకపోతే చేతకాదని చెప్పాలంటూ నారాయణ సంచలన విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయినా ఆగాలి లేదా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నాశనం అయినా అవ్వాలంటూ నారాయణ శాపనార్థాలు పెట్టారు. విశాఖ స్టీల్, ప్రత్యేక హోదా సాధించలేకపోతే జనానికి ఏం సమాధానం చెబుతారని నారాయణ…పవన్ ను నిలదీశారు. అండర్ గ్రౌండ్లో ఉండగలిగితే ఉండాలని….రాజకీయాల్లో ఎక్కువకాలం ఉండాలంటే కచ్చితంగా పోరాడాల్సిందేనని పవన్ పై నారాయణ విరుచుకుపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఉరిశిక్ష విధించిందని, దానిని అడ్దుకునే శక్తి వెంకయ్యనాయుడికి ఉందని నారాయణ అన్నారు. దేశాధ్యక్షుడి తర్వాతి స్ధానంలో ఉన్న వెంకయ్యనాయుడు స్పందించాలని, ఉరిశిక్ష నుంచి స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని నారాయణ కోరారు.