ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్ శర్మపై.. సీపీఐ పార్టీ జాతీయ నాయకుడు.. ఫైర్ బ్రాండ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను చదువుకున్న మూర్ఖుడు అంటూ.. తిట్టిపోశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
వాస్తవానికి ఇతర సీఎస్ల మాదిరిగా సమీర్‌శర్మ వివాదాలకు దూరంగా ఉంటారు. తనపనేదో తాను చేసుకుపోతారనే పేరుంది. అయితే.. తాజాగా ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించి.. తీసుకువచ్చిన పీఆర్సీ విషయంలో సర్కారు తమకు అన్యాయం చేస్తోందంటూ.. ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు.
ఈ క్రమంలో ప్రభుత్వంతీసుకువచ్చిన పీఆర్సీ.. దీనికి గాను సర్కారు నియమించిన కమిటీకి సమీర్ శర్మే నేతృత్వం వహించారు. ఆయనతీసుకువచ్చిన సిఫారసులనే సీఎం జగన్ అనుమతించి.. అమలుకు పచ్చజెండా ఊపారు. దీంతో సీఎస్ తమకు అన్యాయం చేశారని.. సీఎంను సైతం ఆయన తప్పుదోవ పట్టించారని.. ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీర్ శర్మ నిర్ణయించిన పీఆర్ సీ వల్ల తమకు నష్టం జరుగుతుందని వారు చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీని రద్దు చేసి, పాతదే అమలు చేయాలని ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనితో అన్ని జిల్లాలలో కలక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టారు. అయితే, పీఆర్సీ రిపోర్ట్ కమిటీతో చేసినది కాకుండా, సీఎస్. తన రిపోర్ట్ ప్రకారం హెచ్.ఆర్.ఎ. వంటివి బాగా తగ్గించేసి ఉద్యోగులకు అన్యాయం చేశారని రాజకీయ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో స్పందించిన సీపీఐనాయకుడు నారాయణ సీఎస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన చదువుకు న్న మూర్ఖుడు అంటూ.. కామెంట్ చేశారు. ఎవరైనా.. పీఆర్సీ ప్రకటిస్తే.. ఉద్యోగుల వేతనాలు తగ్గుతాయా? ఈ సీఎస్ మూర్ఖుడు కాబట్టే.. వేతనాలు తగ్గుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమయంలో.. వివర ణ ఇచ్చిన సీఎస్ కామెంట్లపైనా నారాయణ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సలహాదారులకు జీతాలు ఇవ్వడం.. సంక్షేమాన్ని అమలు చేస్తున్నందునే కొంత పీఆర్సీలో ఆలోచించాల్సి వచ్చిందన్న సీఎస్ వ్యాఖ్యలపై నారాయణ మండిపడ్డారు.
ప్రభుత్వ సలహాదారులు అచ్చోసిన ఆంబోతులు మాదిరి తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు.. సలహాదారులు ఎందుకని నారాయణ ప్రశ్నించారు. ఉద్యోగులు… వారికి రావాల్సినవి మాత్రమే అడుగుతున్నారని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉంటామని నారాయణ స్పష్టం చేశారు. మొత్తానికి నారాయణ చేసిన కామెంట్లు తీవ్ర దుమారమే రేపుతుండడం గమనార్హం.