మెగా స్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై సీపీఐ నారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్ల నేపథ్యంలో నారాయణపై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో,చివరకు దిగొచ్చిన నారాయణ తాజాగా చిరంజీవికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని నారాయణ ప్రకటించారు.
‘‘చిరంజీవి గురించి ఓ కామెంట్ చేశాను..ఆ కామెంట్ వల్ల చిరంజీవి గారి అభిమానులు, కాపు మహానాడుకు చెందిన కొంతమంది మహానుభావులకు ఆవేశం…బాధ కలిగాయి. దానిని నేనే అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ, చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు విషయంలో రాజకీయ భాషను మించి మాట్లాడానని..అది భాషాదోషమని గమనించాను..పశ్చాత్తాప పడుతున్నాను..దండంతో సరి..ఇక ఆ విషయం వదిలేయండి’’ అంటూ నారాయణ స్వయంగా మీడియాకు వెల్లడించారు.
ఈ క్రమంలోనే నారాయణను జనసైనికులు క్షమించాలని నాగబాబు అన్నారు. తప్పు ఎవరు చేసినా సరే… ఒకసారి క్షమాపణలు కోరితే క్షమించడం జనసైనికుల ధర్మమని నాగబాబు అన్నారు. సీపీఐ నారాయణ పెద్ద వయసును దృష్టిలో ఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని మెగా జనసైనికులందరినీ నాగబాబు కోరారు. అయితే, చిరుకు క్షమాపణలు చెప్పిన నారాయణ…పవన్ కు చెప్పకపోవడంపై కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి, నారాయణ, నాగబాబుల రిక్వెస్ట్ కు మెగా ఫ్యాన్స్ శాంతిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.