మీకంటూ సొంత బలం ఉందా? ఏ రోజైనా సొంతంగా గెలిచారా? ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకునే తోక పార్టీలుగా.. పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేత తిట్టు తిన్న కమ్యునిస్టుపార్టీ తాజాగా అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నాయి. తాజాగా జరుగుతున్న సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీపీఐ(ఎం) పార్టీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
తాజాగా నియోజకవర్గంలో చోటు చేసుకున్నరాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ఆ పార్టీ వెల్లడించి షాకిచ్చింది. ఒకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున పోరాడుతున్న ఈ కమ్యునిస్టు పార్టీ.. మరోవైపు సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.తమ పార్టీ అభిమానులు.
సానుభూతిపరులు.. అందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని వారు అభ్యర్థించటం విశేషం. సాగర్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని సీపీఐ(ఎం) తాజాగా వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణ అధికారపక్షానికి సాగర్ ఉప ఎన్నిక సానుకూలంగా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. సీపీఐ(ఎం) చేసిన ప్రకటన మరింత లాభాన్ని చేకూరుస్తుందన్న మాట వినిపిస్తోంది.