స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కామ్రేడ్ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. సీపీఐ, సీపీఎం నేతలు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర డెవలప్మెంట్ కంటే కూడా సీఎం జగన్‌కు ప్రతీకార వాంఛ ఎక్కువైందని వామపక్ష నాయకులు విమర్శించారు. దీనిపై సోమవారం అన్ని పక్షాలతో సమావేశం నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ తెలిపారు.
”చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నాం. కక్ష సాధింపు రాజకీయాలకు రాష్ట్రం వేదికగా మారింది. రాష్ట్ర డెవలప్మెంట్ కంటే కూడా జగన్‌కు ప్రతీకార వాంఛ ముఖ్యంగా మారింది. అదే అవినాష్ అరెస్టుకు 4 రోజులుగా గెస్ట్ హౌజ్‌లో సీబీఐ ఏం చేసింది? ఇప్పుడు రాజకీయ పర్యటనలో ఉన్న బాబును మాత్రం రాత్రి వెళ్లి అరెస్టు చేశారు. బాబు సహకరించకపోతే బస్సు లాక్కుపోతామని ఎలా అన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో చూపిన ఉత్సాహం.. వివేకా హత్య కేసు నిందితులను పట్టుకోవడంలో జగన్ ఎందుకు చూపడం లేదు? విజయవాడలో సోమవారం అన్ని పక్షాలతో సమావేశం నిర్వహిస్తాం. ఆ తర్వాత చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటిస్తాం’’ అని రామక్రిష్ణ వెల్లడించారు.
మరోవైపు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన తీరు పట్ల సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి చంద్రబాబు వసతిపై దాడి చేసి, తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును తక్షణమే విడిచిపెట్టి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆరోపణలపై చట్టబద్ధంగా విచారణ జరపాలని ఆయన కోరారు. తండ్రిని కలిసేందుకు చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను అనుమతించకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా బాబు అరెస్టుపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరస్తుడైన జగన్‌పై అనేక కేసులు ఉన్నాయని, బెయిల్‌పై తిరుగుతూ కోర్టు వాయిదాలకు సక్రమంగా హాజరు కావడం లేదని నారాయణ అన్నారు. ఈ అరెస్టు ద్వారా బాబుకు పట్టుకున్న శని పోతుందని, ఆయనకు మంచే జరుగుతుందని నారాయణ చెప్పారు.