పెను సంచలనంగా మారిన తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే ఆవునెయ్యిలో గొడ్డు కొవ్వు.. పంది కొవ్వు ఉంటాయన్న తీవ్ర ఆరోపణలు ఇప్పుడు పెను దుమారంగా మారాయి. తిరుమల శ్రీవారి లడ్డూ.. అన్నప్రసాదాల్లో నాణ్యత లోపించిందన్న వాదనను పలువురు భక్తులు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో జులైలో తిరుమలకు వచ్చిన నాలుగు నెయ్యి టాంకర్ల నాణ్యత మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం ముఖ్యమంత్రిచంద్రబాబు వరకు వెళ్లింది.
వెంటనే ఆయన.. తిరుమలకు వచ్చిన నాలుగు నెయ్యి టాంకర్ల శాంపిళ్లను తీసుకొని జాతీయ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుకు టీటీడీ పంపింది. అక్కడ జరిపిన పరీక్షల్లో కల్తీఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని అధికారులకు నివేదికల రూపంలో అందాయి. ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే టీటీడీ ఆవు నెయ్యి సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టేసింది. ఇదిలా ఉంటే 2019-24 మధ్య కాలంలో ఊరుపేరు లేని సంస్థల్ని పట్టుకొచ్చి ఎక్కడెక్కడినుంచో నెయ్యిని సేకరించినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పదిహేనేళ్లుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని నెయ్యిని వాడేవారు. అందుకు భిన్నంగా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిని ఆవునెయ్యిని కొనుగోలు చేయటం ఆపేశారు. ఖర్చు పెరుగుతుందన్న కారణంగా నందిని ఆవునెయ్యిని కాకుండా.. ఇతర సంస్థల నుంచి ఆవునెయ్యిని కొనుగోలు చేశారు. 2023 ఫిబ్రవరిలో మల్ గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ నుంచి పది లక్షల కేజీల నెయ్యిని కొనటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతకాదు.. ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ కూ నెయ్యి సరఫరా కాంటాక్టును కట్టబెట్టారు.
సాధారణంగా వెండర్లు ఎవరు ఆవునెయ్యిని పంపినా.. వాటి నాణ్యతా పరీక్షల్ని ప్రభుత్వ ల్యాబ్ లకు పంపకపోవటం అనుమానాలకు తావిస్తోంది. అందుకు భిన్నంగా థర్డ్ పార్టీ ప్రైవేటు ల్యాబ్ లును ఎందుకు ఎంచుకున్నారన్నది ఇప్పుడు కొత్త సందేహం. మరోవైపు.. రాజస్థాన్ నుంచి ఆవుల్ని తెప్పించి వాటి నెయ్యినే లడ్డూల తయారీకి వాడినట్లుగా టీటీడీ మాజీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తప్పుడు మాటలు ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు.