విస్మయానికి గురయ్యే అంశంగా చెప్పాలి. ఓపక్క కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచ మంతా ఆగమాగం అవుతోంది. ఈ దేశం ఆ దేశం అన్న తేడా లేకుండా ఇబ్బందులకు గురవుతోంది.
ప్రపంచంలో అతి పెద్ద జనాభా ఉన్నరెండో దేశమైన మన దగ్గర.. కరోనా ఇప్పుడెంతలా విరుచుకుపడుతుందో రోజువారీగా నమోదవుతున్న అధికారిక లెక్కల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది.
అధికారిక లెక్కల ప్రకారం రోజుకు మూడున్నర లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు.అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రజలకు అందాల్సిన వైద్యం అందక.. పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంతటి భీతవాహ పరిస్థితి మరింత పెరగటమే తప్పించి.. తగ్గే సూచనలు రానున్న రెండు వారాల్లో ఉండవన్న మాట వినిపిస్తోంది.
ఇలాంటివేళలో.. ఒక దేశం తమ దేశ పౌరుల్ని మాస్కులు పెట్టుకోకుండా వీధుల్లోకి వచ్చేయొచ్చన్నప్రకటన చేసే పరిస్థితి ఉంటుందా? అంటే లేదనే చెబుతారు. కానీ.. అలాంటి పనే చేసిన ఒక దేశం తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంతకీ ఆ దేశం మరేదో కాదు.. ఇజ్రాయెల్. ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మారితో వణికి చస్తుంటే.. అందుకు భిన్నంగా ఇజ్రాయల్ మాత్రం తమ దేశ పౌరుల్ని మాస్కులు లేకుండా బయటకు వెళ్లొచ్చని పేర్కొంది.
స్కూళ్లు..కాలేజీలు.. మార్కెట్లు.. మాల్స్.. ప్రార్థనా స్థలాలు.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఇలా అది ఇది కాదు.. ఏదైనా.. ఎక్కడికైనా సరే.. మాస్కులు లేకుండా మునుపటి మాదిరి స్వేచ్ఛగా తిరిగేయొచ్చని చెప్పేసింది. దీనికి కారణం.. ఆ దేశంలో సగం మందికి పైనే వ్యాక్సినేషన్ పూర్తి కావటమే. మిగిలిన దేశాలతో పోలిస్తే.. వ్యాక్సినేషన్ విషయంలో ఇజ్రాయెల్ ముందుచూపుతో వ్యవహరించింది.
దేశ ప్రజల్లో అత్యధికులకు టీకా కార్యక్రమం పూర్తి చేసేలా చూసుకోవటంతో పాటు.. మొదటి డోసు పూర్తి చేసుకున్న వారు 60 శాతం ఉంటే.. రెండు డోసులు వేయించుకున్న వారు 56 శాతంగా ఉంది. ఈ దేశంలో ఫైజర్.. బయోఎన్ టెక్ టీకాల్ని అందిస్తున్నారు.
పదహారేళ్ల లోపు వారికి మినహా మిగిలినవారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇజ్రాయెల్ టీకా కార్యక్రమాన్ని న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రశంసించింది.
ముందుచూపుతో వ్యవహరించిన వైనమే ఇప్పుడా దేశాన్ని మహమ్మారి ముప్పు నుంచి తప్పించిందని చెప్పాలి. కరోనా వేళ.. మునుపటి రోజులు సాధ్యమేనా? అన్న సందేహం పలువురిని వెంటాడుతున్న వేళ.. ఇజ్రాయెల్ ను చూపిస్తే సరిపోతుంది.