సెకండ్ వేవ్ షురూ కావటం.. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు.. ప్రజలకు చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్ మహా వేగంగా విస్తరిస్తోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ తీవ్రతే కాదు స్పీడ్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే సెకండ్ వేవ్ బారిన పడిన అమెరికా.. యూరోప్ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. మన దేశంలో ఢిల్లీ.. కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే దాని ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇలాంటివేళ.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఎంత త్వరగా సగటు జీవికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.
ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ తయారీలో తలమునకలైన ఎన్నో కంపెనీలు తమ టీకాను త్వరలోనే తెస్తామని చెబుతోంది. తాజాగా సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేశారు. ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంది కాబట్టి.. ఒక్కో డోస్ ను మూడు నాలుగు డాలర్లకు అందజేస్తామని పేర్కొంది. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ-ఆస్ట్రాజెనెకా డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ ను తయారీ విషయంలో ఫూణెకు చెందిన సీరమ్ జత కట్టటం తెలిసిందే.
ప్రస్తుతం మూడో దశ క్లినికల్ టెస్టులు భారత్ లో షురూ అయ్యాయి. తమ వ్యాక్సిన్ జనవరి నాటికి వైద్య సిబ్బందికి అందిస్తామని చెబుతోంది. జనవరి – ఫిబ్రవరి నాటికి వైద్యులు.. ఇతర అత్యవసర సిబ్బందికి అందుబాటులోకి వచ్చేస్తుందని చెప్పారు. మార్చి – ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజానీకానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక్కొక్కరికి వ్యాక్సిన్ రూ.1000 నుంచి రూ.1200 మధ్య లభించే అవకాశం ఉందన్నారు. ఒక్కొక్కరు రెండు డోసుల్లో వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుందని.. ఒక్కో డోస్ రూ.500-600 మధ్య ఉంటుందన్నారు.
మార్చి- ఏప్రిల్ నాటికి 30 నుంచి 40 కోట్ల డోసులు సిద్ధంగా ఉంచగలుగుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అన్ని చెప్పిన ఆయన.. మరో విషయాన్ని చెప్పేశారు. వ్యాక్సిన్ విడుదల అన్నది ఫలితాల మీద ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ టెస్టుల్లో ఉన్న వ్యాక్సిన్ తుది ఫలితం తేడా కొడితే మాత్రం అందుబాటులోకి రావటం కష్టమవుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం జనవరి రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.