కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదికి పైగా వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చాయి.
ఒక్కో దేశంలో ఒక్కో వ్యాక్సిన్.. కొన్ని దేశాల్లో నాలుగైదు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో.. కోవీ షీల్డ్.. కోవాగ్జిన్లు అందుబాటులో ఉండగా.. మరికొద్దిరోజుల్లో రష్యాకు చెందిన స్పుత్నిక్ రానుంది.
మరిన్ని వ్యాక్సిన్లను భారత్ మార్కెట్లోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటివేళ.. కోవిడ్ కు వ్యాక్సిన్ ఫార్మాట్ లో కాకుండా.. ట్యాబ్లెట్ల రూపంలో ఔషధాన్ని తీసుకొచ్చే దిశగా ప్రముఖ ఔషధ రంగ సంస్థ ఫైజర్ ఫోకస్ చేసింది.
కోవిడ్ చికిత్సలో భాగంగా నోటి ద్వారా మాత్ర రూపంలో మందును వచ్చే ఏడాదిలోపు తీసుకువస్తామని ఫైజర్ చెబుతోంది. నోటి ద్వారా.. ఇంజక్షన్ రూపంలో తీసుకునే రెండు మందులకు సంబంధించిన ప్రయోగాలు సాగుతున్నట్లుగా ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది.
ఇప్పటికే వ్యాక్సిన్ రూపంలో వచ్చిన నేపథ్యంలో.. రెండు విధాలుగా యాంటివైరల్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు ఫైజర్ చెబుతోంది. ముందు మాత్ర రూపంలో తేవటానికి ప్రాధాన్యత ఇస్తామని.. దీంతో..కోవిడ్ కారణంగా ఆసుపత్రికి వెళ్లే అవసరం తప్పుతుందని ఫైజర్ సీఈవో ఆల్ బెర్ట్ బౌర్లా చెప్పారు.
వ్యాక్సిన్ తేవటానికి ఎంత వేగంగా పని చేశామో.. అంతే వేగంగా మాత్ర రూపంలో ఔషధాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జరుగుతున్న అధ్యయనాల్లో పురోగతి కనిపిస్తుందన్నారు.
కొద్ది నెలల్లోనే ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే.. ప్రపంచానికి ఇదో తీపి కబురు అవుతుందని చెప్పక తప్పదు.