గడచిన ఏడాది కాలంగా ఒక్క హైదరాబాద్ లో మాత్రమే ఎంతమంది చనిపోయారో తెలుసా ? 32,752 మంది. అవును మీరు చదివింది నిజ్జంగా నిజమే. ఏప్రిల్, 2020 నుండి మే 2021 వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్యను గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ బయటపెట్టింది. ఓ స్వచ్చంధ సంస్ధ ప్రతినిధులు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్రింద జీహెచ్ఎంసికి దరఖాస్తు చేసుకుంటే పై సమాధానమిచ్చింది.
అంటే కోవిడ్ ఎంత సివియర్ గా ఉన్నా తెలంగాణాలో కేసులు ఏ రోజు కూడా 4 వేలు దాటలేదు. పైగా మృతుల సంఖ్య అయితే వందల్లోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నెలల తరబడి చెబుతునే ఉంది. తెలంగాణాలో కరోనా వైరస్ ఉధృతి లేనే లేదని, మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణాలో పరిస్ధితి చాలా మెరుగ్గా ఉందని కేసీయార్ దగ్గర నుండి మంత్రులు, ఉన్నతాధికారులు ఎన్నిసార్లు అరిగిపోయిన రికార్డును వినిపించారో లెక్కేలేదు.
గడచిన ఏడాదిలో జీహెచ్ఎంసి జారీచేసిన డెత్ సర్టిఫికేట్లను చూస్తే పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమైపోతోంది. జీహెచ్ఎంసి జారీచేసిన డెత్ సర్టిఫికేట్లు కేవలం జీహెచ్ఎంసి పరిధిలోని మరణాలకు సంబంధించి మాత్రమే. మిగిలిన రాష్ట్రానికి ఏమాత్రం సబంధం లేదు. ఆ లెక్కలు మళ్ళీ సపరేటుగా ఉంటాయి. అవికూడా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే లెక్కలు బయటకు వస్తాయేమో.
2020, ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్యలో 18,420 మంది చనిపోయారు. అలాగే ఈ ఏడాది జనవరి-మే నెలల మధ్యలో అంటే నాలుగు నెలల్లోనే 14,332 మంది చనిపోయారు. డెత్ సర్టిఫికేట్ల ప్రకారం ఈ మరణాలన్నీ కోవిడ్ మరణాలే అని అర్ధమైపోతోంది. విచిత్రమేమిటంటే కరోనా వైరస్ కారణంగా గడచిన ఏడాదిలో చనిపోయిన వారి సంఖ్య 3257 మాత్రమే అని ప్రభుత్వం చెబుతోంది.
ఒకవేళ ప్రభుత్వ ప్రకటనే నిజమని అనుకుంటే మరి జీహెచ్ఎంసి జారీచేసిన 32,752 డెత్ సర్టిఫికేట్లు మాటేమిటి. జీహెచ్ఎంసి జారీచేసిన డెత్ సర్టిఫికేట్లలో కేవలం 10 శాతం మాత్రమే కరోనా వైరస్ తో చనిపోయిందే నిజమైతే మరి మిగిలిన వారంతా ఎలా చనిపోయారు ? జారీ చేసిన డెత్ సర్టిఫికేట్ల ప్రకారం ఏ సమస్యతో ఇన్ని వేలమంది చనిపోయారు ? మొత్తం రాష్ట్రాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇంకెన్ని వేలమంది చనిపోయారనే విషయానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.