నెల క్రితం వరకు కరోనా కేసులు అంతంతమాత్రంగా నమోదైన కరోనా కేసుల తీవ్రత ఒక్కసారిగా పెరగటం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉంది. అయితే.. ఈ నెల మొదటి నుంచి మొదలైన కేసుల నమోదు వేగం.. అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా తెలంగాణను దాటేసిన ఏపీ.. భారీ కేసుల్ని నమోదు చేసింది. తెలంగాణలో బుధవారం ప్రకటించిన మొత్తం కేసులు 3052 మాత్రమే.
అదే సమయంలో ఏపీలో మాత్రం 4228పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం.ఇదిలా ఉంటే.. తెలంగాణలోని మూడున్నర కోట్ల జనాభాలో 1.25 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరం.. దానికి అనుకొని ఉండే రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాలు మొత్తం కలిపినా వెయ్యి కేసులు దాటని పరిస్థితి. జీహెచ్ఎంసీ పరిధిలో 406 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందుకు భిన్నంగా ఏపీలోని పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది.
ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో బుధవారం వెల్లడించిన కొత్త కేసులు 842గా తేల్చారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా నిలిచింది. తర్వాతి స్థానంలో గుంటూరుజిల్లా నిలిచింది. ఆ జిల్లాలో 622 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలో 538 కేసులు నమోదు కాగా.. విశాఖ జిల్లాలో 414 కేసులు నమోదయ్యాయి. ఏపీలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ నాలుగు జిల్లాల్లోనే 60 శాతానికి పైగా కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది.
హైదరాబాద్ తో పోలిస్తే.. మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉండే చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 4947 కేసులు ఉండగా.. గుంటూరు జిల్లాలో 3246 కేసులు నమోదయ్యాయి. విశాఖలో 3043, క్రిష్ణా జిల్లాలో 2876 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈ నాలుగు జిల్లాల్లో ప్రత్యేక ఆంక్షలు విధించారు. కేసులు ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. ఇదే తీరులో మిగిలిన జిల్లాల్లో పరిస్థితి చేయి దాటితే.. అక్కడా ఇదే పరిస్థితి తప్పదన్న మాట వినిపిస్తోంది.