తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. కొన్నిసార్లు కొందరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేసే చేష్టలు చివరకు వారికే చుట్టుకుంటాయి. తాజా ఘటన తెలిస్తే ఇది నిజమని మీరే నమ్ముతారు. కోర్టు దగ్గర ఒక భర్త చేసిన చేష్టకు.. అతడికి అర్థమయ్యే భాషలోనే బదులిచ్చింది న్యాయస్థానం. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన దశరథ్ కు సీమా భార్యభర్తలు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో విడిపోయారు. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ జరుగుతున్న వేళ.. భర్త నుంచి విడిపోయి ఉంటున్న సీమకు నెలకు రూ.5 వేలు చొప్పున పోషణ ఖర్చులు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. కానీ భర్త ఆ పని చేయలేదు.
ఇదే విషయాన్ని సీమ కుటుంబ సభ్యులు కోర్టు ముందు ఉంచారు. స్పందించిన కోర్టు.. 11 నెలలుగా అతడు చెల్లించాల్సిన పోషణ ఖర్చుల్ని వెంటనే చెల్లించాలని ఆదేశించటంతో పాటు.. అతడిపై రికవరీ వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. వారి కుటుంబ సభ్యులు కోర్టుకు ఏడు బస్తాల్లో రూ.55 వేల చిల్లర నాణేలను తీసుకొచ్చారు.
అతని పనికి భర్త తరఫు వారు షాకయినా తెలివిగా దానిని కోర్టులో పెట్టారు. తన క్లయింట్ ను మానసికంగా వేధించటం కోసమే భర్త బంధువులు ఇలాంటి పని చేశారంటూ సీమ తరఫు లాయర్ ఫ్యామిలీ కోర్టుకు తెలియజేశారు. నాణెల రూపంలో దశరథ్ డబ్బులు ఇవ్వటాన్ని కోర్టు ఒప్పుకుంది. అయితే.. ఇక్కడో చిన్న ట్విస్టు పెట్టింది. నాణెల రూపంలో భార్యకు ఇవ్వాలనుకున్న పోషణ మొత్తాన్ని.. అతడే స్వయంగా లెక్కించి ఇవ్వాలని ఆదేశించింది.
ఈ కేసు తదుపరి విచారణ సందర్భంగా జూన్ 26న ఏడు బస్తాల్ని స్వయంగా లెక్కించటమే కాదు. వెయ్యి రూపాయిల చొప్పున నాణెల్ని పోట్లాలుగా కట్టి భార్యకు ఇవ్వాలని ఆదేశించింది. ఏడు బస్తాలతో కోర్టుకు వచ్చిన దశరథ్ ఫ్యామిలీకి కోర్టు సరైన రీతిలో షాకిచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.