తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులతో కేటీఆర్‌కు సంబంధాలున్నాయని ఆరోపించిన రేవంత్…నార్కోటిక్ టెస్ట్ కు కేటీఆర్ రావాలని ఛాలెంజ్ చేశారు. అయితే, రాహుల్ గాంధీ టెస్టుకు వస్తే తాను కూడా సిద్ధమని కేటీఆర్ ప్రతి సవాల్ విసరడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ క్రమంలోనే రేవంత్ పై కేటీఆర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నేడు ఆ కేసు విచారణ పూర్తిచేసిన సిటీ సివిల్ కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి సిటీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇంజెక్షన్ ఆర్డర్‌పై వాదనలు ముగియగా…మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కేటీఆర్ కోరారు. అయితే, మధ్యంతర ఉత్తర్వులను కోర్టు రిజర్వ్ చేసింది. డ్రగ్స్ కేసులో.. ఈడీ కేసులో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదని కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఇక, సోషల్ మీడియా మీడియాలో ఉన్న లింక్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే కోర్టు… రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డిని ఆదేశించింది. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు.
వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాంగ్రెస్ – టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రేవంత్ దిష్టి బొమ్మను టీఆర్ ఎస్ కార్యకర్తలు దగ్ధం చేసేందుకు యత్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒకానొక దశలో రాళ్లు విసురుకోవడం.. కర్రలతో దాడి వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు.