ఏపీలో టెన్త్ పేపర్ల లీక్ అని, అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవకతవకల ఆరోపణలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ స్కాం మొత్తం నారాయణ విద్యా సంస్థల వారే చేశారన్న ప్రాథమిక సమాచారంతో ఆ విద్యా సంస్థల చైర్ పర్సన్ హోదాలో ఉన్నారంటూ నారాయణను అరెస్ట్ చేశారు. అయితే, నారాయణ చైర్మన్ హోదాలో లేరని, చాలాకాలం క్రితమే రాజీనామా చేశారని నారాయణ తరఫున న్యాయవాదులు ఆధారాలతో సహా నిరూపించడంతో ఆయనకు బెయిల్ మంజూరైంది.
కానీ, ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ చిత్తూరు జిల్లా కోర్టులో జగన్ సర్కార్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. రిమాండ్ విధించకుండానే నారాయణకు బెయిల్ ఇచ్చారంటూ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలుస్తోంది. జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తేనే హైకోర్టులో పిటిషన్ వేసేందుకు అవకాశం ఉండడంతో మొక్కుబడిగా రివిజన్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. నారాయణను ఇరుకున పెట్టేందుకు హైకోర్టుకు వెళ్లేందుకే జగన్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై చిత్తూరు జిల్లా కోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలంటూ నారాయణకు కోర్టు నోటీసులు జారీచేసింది. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ పై ఈ నెల 24న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో, ఈ నెల 24న చిత్తూరు కోర్టులో జరగబోయే వాదనలు ఆసక్తికరంగా మారాయి. నారాయణ బెయిల్ రద్దవుతుందా.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది.
అంతకుముందు కోర్టులో బెయిల్ రద్దుపై ఆసక్తికర వాదనలు జరిగాయి. ఈ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని, అందుకే బెయిల్ రద్దు చేయాలని కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందని ప్రభుత్వం తరఫున వాదించిన అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేయకుండానే నారాయణకు బెయిల్ మంజూరైందని చెప్పారు. అయితే, నారాయణ 2014లోనే నారాయణ విద్యాసంస్తల చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారన్న నారాయణ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో, నారాయణకు బెయిల్ మంజూరైంది.