గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇటీవల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదుదారుడు గా ఉన్న సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ గ్రౌండ్స్‌లో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో కోరారు. అలాగే వెన్నుపూస నొప్పి కారణంగా జైలులో తనకు బెడ్ ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని, ఇంటి నుంచి ఫుడ్ తెప్పిచ్చుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ మరో పిటిషన్ కూడా వేశారు. ఇంకోవైపు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఒక పిటిషన్ వేశారు.
వంశీ తరఫు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ల పై సోమవారం విచారణ ప్రారంభమైంది. మంగళవారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దీంతో వల్లభనేని వంశీకి బెయిలా..? జైలా..? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన సత్యవర్ధన్ `నన్ను అపరహరించి బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని.. భయపెట్టి ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేశారని` కోర్టు ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇకవేళ సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని కోర్టు తీవ్రంగా పరిగనిస్తే.. వంశీకి బెయిల్ వచ్చే అవకాశమే ఉండదు. అదే జరిగితే వంశీ పది రోజుల పోలీసుల కస్టడీకి వెళ్లాల్సి ఉంటుంది. పది రోజులతోనే పోలీసులు కస్టడీని ముగించరు. మరింత అనుబంధ చార్జి షీట్లు దాఖలు చేశారంటే.. కోర్టు సైతం పోలీసుల వాదనను ఏకీభవించాల్సిందే. ఇదంతా జరగకూడదని వంశీ తరఫు లాయర్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లో వంశీకి బెయిల్ వస్తుందా? లేక మళ్లీ జైలుకేనా? అన్నది తేలిపోనుంది.