దేశంలోని అత్యంత ఆదరణ కలిగిన రాజకీయ నాయకులలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఒకరు. అయితే, పాపులారిటీతో పాటు చంద్రబాబుకు శత్రువులు కూడా పెరిగారు. 2003లో అలిపిరిలో మావోయిస్టుల బాంబు దాడి నుంచి చంద్రబాబు తృటిలో బయటపడ్డారు. ఇక, తాజాగా కూడా ఆయనకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఆల్రెడీ ఉన్న భద్రత సరిపోవడం లేదని మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
చంద్రబాబు భద్రత కోసం తాజాగా కౌంటర్ యాక్షన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆల్రెడీ చంద్రబాబు భద్రతా బృందలో ఉన్న ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలు కౌంటర్ యాక్షన్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ యాక్షన్ టీంకు ఎస్పీజీ ఆధ్వర్యంలో శిక్షణనిస్తున్నారు. భారతదేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న అతికొద్ది మంది లీడర్లలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.
ఇకపై, చంద్రబాబు భద్రత మూడు వలయాలు ఉంటాయి. తొలి వలయంలో ఎన్ఎస్జీ, రెండో వలయంలో ఎస్ఎస్జీ, మూడో వలయంలో దూరంగా ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు. ఏదైనా జరిగితే ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ బృందాలు చంద్రబాబును వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాయి. దాడికి వచ్చిన వారిని కౌంటర్ యాక్షన్ టీమ్ తుదముట్టిస్తుంది. నిన్నటి నుంచి అధికారికంగా చంద్రబాబు భద్రతావలయంలో ఈ కౌంటర్ యాక్షన్ టీం చేరింది.