మహమ్మారి ముప్పు ఇంకా పోలేదు. కానీ.. ఆ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్దగా పట్టించుకోవటం లేదు. మహ్మమారి సెకండ్ వెర్షన్ తో పాటు.. యూకే వైరస్ పుణ్యమా అని అగ్రరాజ్యాలైన అమెరికా.. బ్రిటన్ తదితర దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయినప్పటికీ పలువురు వీటిని సీరియస్ గా తీసుకోని పరిస్థితి. ఇలాంటివేళ.. నిర్లక్ష్యం ఖరీదు ఎంత భారీగా ఉంటుందన్న విషయాన్ని చెప్పే ఉదంతం ఒకటి సూర్యాపేటలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంతో సూర్యాపేట మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరస్థితి.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్ షిప్ లో డిసెంబరు 24న ఒక పెద్దాయన అనారోగ్యంతో మరణించారు. ఆయనకు ఒక కొడుకు.. నలుగురు కుమార్తెలు. వారితో పాటు పిల్లలు.. బంధువులు ఇలా భారీగా హాజరయ్యారు. అనంతరం కర్మకాండల కోసం అదే ఇంట్లో ఉన్నారు. అయితే.. మరణించిన పెద్దాయన కొడుక్కి జలుబు.. జ్వరం ఉండటంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో కరోనా టెస్ట్ చేయించారు.ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. కాలనీలో ఉన్న అతడి సమీప బంధువులు.. కుటుంబ సభ్యులకు పరీక్షలు చేశారు. మొత్తం 33 మందికి నిర్దారణ పరీక్షలు చేస్తే..వారిలో 22 మందికి కరోనా సోకినట్లుగా తేలింది. ఒకేచోట ఇంత పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు ఒక్కసారిగా అలెర్టు అయ్యారు. సదరు టౌన్ షిప్ లో ప్రతి ఒక్క ఇంటికి ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి.. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసింది. ప్రస్తుతం పాజిటివ్ ఉన్న వారందరిని ఇంట్లోనే ఉంచి క్వారంటైన్ చేస్తున్నారు. తాజాగా పాజిటివ్ గా తేలిన వారిలోకొత్త వైరస్ లక్షణాలు లేవని చెబుతున్నారు. ఏమైనా..కరోనా భూతం ఇంకా పోలేదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అది మనల్ని కాటేయటానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుందన్న చేదు నిజాన్ని మర్చిపోతే.. భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.