అఖండ సినిమా వచ్చింది. తెలుగు సినిమా ప్రియులను సంబరాల్లో ముంచెత్తింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత డల్లుగా సాగుతున్న బాక్సాఫీస్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చిన చిత్రమిది. కరోనా దెబ్బకు ప్రేక్షకుల్లో కొంత శాతం థియేటర్లకే రావడం మానేసిన రోజుల్లో, కొవిడ్ భయాలు ఇంకా కొనసాగుతున్న టైంలో, ఏపీలో టికెట్ల రేట్ల మీద నియంత్రణ ఉండగా ఈ సినిమా రూ.150 కోట్ల గ్రాస్ సాధించడం అనూహ్యం.
బాలయ్య కోత మొదలుపడితే… పుష్పతో అల్లు అర్జున్ దానిని కొనసాగించాడు. ఇక బాక్సాఫీస్ మోతను మరో స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చే నెల రోజుల్లో మరిన్ని భారీ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే కరోనా మూడో వేవ్ వీటిని ఆందోళనలో పడేసింది.
పుష్ప తర్వాత అందరి దృష్టి ఆటోమేటిగ్గా ‘ఆర్ఆర్ఆర్’ మీదికి మళ్లుతుందనడంలో సందేహం లేదు. ‘బాహుబలి’ తర్వాత తనపై భారీగా పెరిగిపోయిన అంచనాలను రాజమౌళి ఏమేర అందుకుంటాడో.. ఆ సినిమా స్థాయిలో తన తర్వాతి చిత్రానికి యుఫోరియా తీసుకురాగడలా అని చాలామంది సందేహించారు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేలాగే కనిపిస్తున్నాడు మన జక్కన్న. మరోసారి ఓ భారీ కథను తెరపై తనదైన శైలిలో ఆవిష్కరించడమే కాదు.. అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీలతో సినిమాకు తిరుగులేని హైప్ తీసుకురాగలిగాడు.
ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేసింది. ‘బాహుబలి’ స్థాయిలోనే ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటాపోటీగా పెర్ఫామ్ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కీరవాణి సంగీతం సహా బోలెడన్ని ఆకర్షణలున్న ఈ సినిమా.. ఇప్పటిదాకా ఏ భారతీయ చిత్రం రిలీజ్ కానంత భారీగా 2022 జనవరి 7న విడుదల కావల్సిన ఈ సినిమా వాయిదా పడింది. మరే చిత్రానికి సాధ్యం కాని ‘బాహుబలి’ రికార్డులను మళ్లీ ఈ రాజమౌళి సినిమానే అందుకుని, బద్దలు కొడుతుందేమో చూడాలి.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అత్యధిక అంచనాలున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. ఇది కూడా కరోనా వల్ల వాయిదా పడి సంక్రాంతికి సినిమాల్లేకుండా చేసింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తే అది కూడా కుదర్లేదు. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్.. తర్వాతి సినిమా ‘సాహో’తో అంచనాలు అందుకోలేకపోయాడు. ఈసారి ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో అతను ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
‘రాధేశ్యామ్’లో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించే యాక్షన్ లేకపోవచ్చేమో కానీ.. భారీతనానికైతే లోటు లేదు. ప్రభాస్‌తో పాటు పూజా హెగ్డే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఒక ఎపిక్ లవ్ స్టోరీ చూడబోతున్న ఫీలింగ్ కలిగించాయి. యువి క్రియేషన్స్ ఏమాత్రం రాజీ లేకుండా చాలా రిచ్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దింది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.
మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారని, అందులో పవన్ కళ్యాణ్ హీరో అని ప్రకటన వచ్చినపుడు పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో కూడా అంతగా ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. రీమేక్ సినిమా అంటే బేసిగ్గా ఉన్న అనాసక్తికి తోడు.. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో ఎప్పట్నుంచో అందుబాటులో ఉండటం, కరోనా టైంలో చాలామంది ఈ సినిమాను చూడటంతో తెలుగు వెర్షన్ మీద అంతగా క్యూరియాసిటీ కనిపించలేదు. కానీ పవన్ గతంలో చేసిన రీమేక్ మూవీస్ గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ తరహాలోనే ఈ చిత్రానికి కూడా తెలుగు టచ్ ఇవ్వడం, పవన్ పాత్రకు ఆకర్షణలు జోడిరచి, మరింత పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దడంతో ఆటోమేటిగ్గా దీనిపై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది.
రానాతో పవన్ కాంబినేషన్ బాగా కుదరడం.. ఈ సినిమా పాటలు సెన్సేషన్ క్రియేట్ చేయడం, ప్రోమోలు కూడా అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్రివిక్రమ్ రచన అందించిన ఈ చిత్రాన్ని సాగర్ కె.చంద్ర రూపొందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి రాజమౌళి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ చిత్రం వాయిదా పడింది. కట్ చేస్తే రాజమౌళి సినిమాయే వాయిదా పడింది.
క్రిస్మస్ కానుకగా వచ్చిన నాని చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ మంచి హిట్ కొట్టింది. ఓటీటీ బాట పట్టిన వి, టక్ జగదీష్ చిత్రాలతో నిరాశ పరిచిన నాని ఈ సినిమాతో మళ్లీ తన స్థాయిని అందుకున్నారు. ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మరోవైపు అక్కినేని నాగార్జున చిత్రం ‘బంగార్రాజు’ ఇంత పోటీలోనూ సంక్రాంతి పోరుకు సై అంటోంది. నాగ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ఇది ప్రీక్వెల్.
‘సోగ్గాడే..’ తరహాలోనే సంక్రాంతికి ‘బంగార్రాజు’ను రిలీజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని నాగ్ భావిస్తున్నాడు. కరోనా ముందు నిలుస్తాడా? లేదా? అన్నది చూడాలి. కళ్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన ఈ చిత్రాన్ని నాగార్జునే స్వయంగా నిర్మించాడు. నాగ్ తనయుడు నాగచైతన్య ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు. ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాని ఈ చిత్రం సంక్రాంతి టైంలో భారీ చిత్రాల మధ్య ఏమేర సందడి చేస్తుందో చూడాలి.