కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందనే వివాదంపై అగ్రరాజ్యం తాజాగా ఆధారాలను బయటపెట్టిందా ? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబరేటరీలోనే కరోనా వైరస్ పుట్టిందని గడచిన ఏడాదిగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అమెరికాతో పాటు చాలా దేశాలు కరోనాకు చైనానే పుట్టిలని మండిపడుతున్నాయి. అయితే చైనా మాత్రం అంగీకరించటంలేదు.
ఈ వివాదాల నేపధ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్య్లూహెచ్ వో) ఆధ్వర్యంలో వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నిజనిర్ధారణపై దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే శాస్త్రవేత్తల బృందం చైనాలోని వూహాన్ లో దర్యాప్తు చేస్తున్నది. అయితే ఇదే సమయంలో వూహాన్ లోనే కరోనా వైరస్ పుట్టిందనేందుకు అమెరికా తాజాగా ఓ ఆధారాన్ని శాస్త్రవేత్తల బృందం ముందు ఉంచింది.
ప్రపంచానికి కరోనా వైరస్ పరిచయం కాకముందే వూహాన్ ల్యాబరేటరీలో పనిచేసే కొందరు శాస్త్రవేత్తలు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారట. వీరందరిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్నట్లు అమెరికా చెప్పింది. శాస్త్రజ్ఞులు చేరిన ఆసుపత్రిలోకి ఇతరులను ఎవరినీ అనుమతించలేదట యాజమాన్యం. అలాగే శాస్త్రజ్ఞుల వివరాలను కూడా ఇప్పటివరకు బయటపెట్టలేదని అమెరికా తన నివేదికలో స్పష్టంగా చెప్పింది.
కరోనా వైరస్ పుట్టుకపై ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నా, తాజాగా అమెరికా ఆధారాలను బయటపెట్టినా చైనా మాత్రం అవన్నీ నిరాధారాలని మాత్రమే కొట్టిపారేస్తోంది. వూహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ రా డేటా, సేఫ్టీలాగ్స్, గబ్బిలాలపై కరోనా వైరస్ తాలూకు పరిశోధనల వివరాలతో పాటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న శాస్త్రవేత్తల వివరాలను మాత్రం చైనా బయటపెట్టడం లేదు. ఈ కారణంగానే కరోనా వైరస్ కు చైనానే పుట్టిల్లనే విషయంలో అనుమానాలు బలపడుతున్నాయి.