టీడీపీ నిర్వహించిన మహానాడు నిజానికి ఆపార్టీకి సొంత కార్యక్రమం. కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న కార్యక్ర మం. అయితే..ఈ విషయంలోనూ వైసీపీ వేలు పెట్టింది. వాస్తవానికి సొంత విషయాల్లోవేలెందుకు పెడతారంటూ.. పదే పదే విమర్శలు గుప్పించే వైసీపీ నాయకులు.. మరి టీడీపీ సొంత కార్యక్రమం మహానాడు విషయంలోవేలెందుకు పెట్టిందన్న దానిపై సమాధానం లేకపోవడం గమనార్హం.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మహానాడు వేదికపై పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనిలో మహానాయకుడు ఎన్టీఆర్, మాజీ సీఎం, ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్రపటాలను ఏర్పాటు చేశారు. అయితే.. దీనిపై వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ ఫోటో ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు.
అంతేకాదు.. హిందూపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచిన అన్నగారి కుమారుడు బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు. బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇల్లరికపు అల్లుడా అని నిలదీశారు. అసలు పోటీ చేసిన చోట గెలవని నారా లోకేష్ ఫొటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కనీసం రెండు సార్లు విజయం దక్కించుకున్న బాలయ్య ఫొటోను ఎందుకు పెట్టలేదని అన్నారు. అయితే.. నాని వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. టీడీపీ సొంత మహానాడు విషయంలో ఏం జరిగితే మీకు ఎందుకు ? అని ప్రశ్నిస్తున్నారు.