తన వైఖరితో తరచూ వార్తలలో నిలిచే తమ్మినేని సీతారాంకు తెలంగాణ టీడీపీ నేతన, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సీరియస్ ప్రశ్నలు సంధించారు. డిగ్రీ మధ్యలో ఆపేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో ప్రవేశమెలా పొందారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన అఫిడవిట్లో అలాగే ఉందని… అదెలా సాధ్యమైందో చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి చదువుల్లో ఏమైనా మినహాయింపులు ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై తమ్మినేని సీతారాం, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు త్వరగా స్పందించి.. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి .. తమ్మినేని సీతారాం 2019 లో స్వీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉన్నత చదువు కోసం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మాగాంధీ లా కాలేజీ లో ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవటానికి అడ్మిషన్ పొందారు. 2019-20లో ఆయన హాల్ టికెట్ నెంబర్ 1724 1983 1298 అని నర్సిరెడ్డి చెబుతున్నారు. ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవాలంటే కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. లేదా డిగ్రీకి సమానమైన అర్హత కలిగిన కోర్స్ పూర్తి చేసినవారు మాత్రమే ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్స్ పూర్తి చేయడానికి అర్హులన్నారు.
కానీ డిగ్రీ మధ్యలోనే ఆపే్సిన తమ్మినేని సీతారాం మూడేళ్ల కోర్సులో ఎలా అడ్మిన్ పొందారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా నర్సిరెడ్డి చెప్పుకొచ్చారు. అనేక టీవీ ఇంటర్వ్యూలలోనే ‘డిగ్రీ డిస్ కంటిన్యూడ్’ చేసినట్లు తమ్మినేని స్వయంగా చెప్పారని తన ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతగా “డిగ్రీ డిస్ కంటిన్యూడ్” అని రాశారన్నారు.2019 సాధారణ ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్ కంటిన్యూడ్ గా ప్రకటించిన తమ్మినేని .. అదే సంవత్సరం ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ పొందడం ఎలా సాధ్యమైంది రాజ్యాంగబద్ధమైన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ హెూదాలో ఉన్నారని చదవులలో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా ? అని నర్సిరెడ్డి ప్రశ్నించారు.
డిగ్రీ లేని వారికి కూడా 3ఏళ్ల ఎల్ఎల్బీలో ప్రవేశానికి సభాపతులకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఏమైనా మినహాయింపులు ఇచ్చారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అసంపూర్తి డిగ్రీతో 3 ఏళ్ల ఎల్ఎల్డీలో చేరేందుకు.. విశ్వ విద్యాలయ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. తాను వెల్లడించిన అంశాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్లు స్పందించాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై అత్యున్నతస్థాయి విచారణ జరిపి ఇలాంటి అక్రమాలు ఇంకెన్ని జరిగాయో, ఇంకెంతమంది ఇలా అనర్హులు అడ్వకేట్లు అయ్యారో వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరి.. ఈ ఆరోపణలకు తమ్మినేని ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.