విజయదశమి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. తాను జైల్లో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని ఎమోషనల్ గా రాసిన లేఖ వైరల్ గా మారింది. త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని, ప్రజలతో మళ్ళీ మమేకమవుతానని చంద్రబాబు చెప్పిన మాటలు టిడిపి నేతలు, కార్యకర్తలలో నూతనోత్సాహాన్ని నింపాయి.
అయితే, తాజాగా ఈ లేఖపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు స్పందించారు. ఆ లేఖతో జైలుకు సంబంధం లేదని సూపరింటెండెంట్ క్లారిటీనిచ్చారు. చంద్రబాబు సంతకంతో జైలు నుంచి ఆ లెటర్ విడుదల కాలేదని అన్నారు. జైలు నిబంధనల ప్రకారం ముద్దాయిలు విడుదల చేయదలిచిన లేఖను ముందుగా జైలు అధికారులు పూర్తిగా పరిశీలిస్తారని, ఆ తర్వాత దానిని జైలు అధికారుల సంతకంతోపాటు రాజమండ్రి సెంట్రల్ జైలు ముద్ర వేస్తారని చెప్పారు.
ఆ తర్వాత సంబంధిత కోర్టులకు, ఇతర ప్రభుత్వ శాఖలకు ఆ లేఖను పంపుతారని అన్నారు. ఇటువంటి సంతకం, ముద్ర ఏమీలేని లేఖతో తమకు సంబంధం లేదని అన్నారు. చంద్రబాబు రాసిన లేఖ కింద స్నేహా బ్లాక్, రాజమండ్రి సెంట్రల్ జైలు అని ఉండటంతో జైలు అధికారులు ఆ లేఖపై స్పందించినట్లు తెలుస్తోంది. ఈ లేఖను చంద్రబాబు కుటుంబ సభ్యులు విడుదల చేసి ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.