ఇటీవల సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జై భీమ్’ఓటీటీలో విడుదలైంది. రిటైర్డ్ జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా వాస్తవ ఘటనలతో రూపొందించిన ఈ చిత్రం ఇటు ప్రేక్షకులతోపాటు విమర్శలకు ప్రశంసలనూ అందుకుంది. అణగారిన వర్గాల కోసం పోరాడే లాయర్ పాత్రలో సూర్య జీవించాడని క్రిటిక్స్ కితాబిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ తమిళ స్టార్ హీరోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అదే సమయంలో ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించి సూర్యపై ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతుండగా పోలీసు ఉన్నతాధికారి అయిన ప్రకాష్ రాజ్ అతడి చెంప ఛెళ్లుమనిపిస్తాడు. ఈ సినిమాలోని ఆ సీన్ హిందీ భాషను అవమానించేలా ఉందని, ఆ సీన్ ను తొలగించాలని బాలీవుడ్ కు చెందిన కొందరు డిమాండ్ చేస్తున్నారు. తాను ఏ నటుడికి నేను వ్యతిరేకం కాదు. కానీ, హిందీ మాట్లాడే ఒక నటుడి చెంప మీద ప్రకాష్ రాజ్ కొట్టి తమిళ్ మాట్లాడామని చెప్పడం సరికాదని అక్కడి ఫిల్మ్ క్రిటిక్ ట్వీట్ చేశారు.
ఉత్తరాదివారిపై ప్రకాష్ రాజ్ కు ఉన్న వ్యతిరేకతను అలా వెళ్లగక్కారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ, హిందీ మాట్లాడే భారతీయులకు ఆ సీన్ వ్యతిరేకం కాదని మరికొందరు అంటున్నారు. ఆ పాత్ర పోషించిన వ్యక్తి హిందీలో మాట్లాడుతూ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ప్రకాష్ రాజ్ దానిని గమనించి…అతడి చెంప మీద కొట్టి తమిళ్లో మాట్లాడామని చెబుతాడు. అది సినిమాలో ఒక సీన్ లాగా మాత్రమే చూడాలని, అక్కడ హిందీ భాషను అవమానించలేదని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి, ఈ వివాదంపై సూర్య, ప్రకాష్ రాజ్ స్పందిస్తారా…ఆ సీన్ తొలగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.