ఏపీ సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాలను హైకోర్టు, సుప్రీం కోర్టు పలు మార్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారం మొదలు…ఏపీలో కరోనా కట్టడి వ్యవహారం వరకు ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ జగన్ తీరు మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రఘురామ అరెస్టు వ్యవహారంలో తాజాగా జగన్ సర్కార్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రఘురామ విషయంలో మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్‌ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను బుధవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రఘురామ విషయంలో ఏపీ హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా.. సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు, రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించింది.
ఆ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై సుమోటోగా కోర్టుధిక్కరణ కింద నోటీసులివ్వాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీచేసింది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు కోర్డు ధిక్కారం కింద వెంటనే నోటీసులివ్వాలని ఆదేశించింది. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని వ్యాఖ్యానించింది. దీంతో, రఘురామ విషయంలోనూ జగన్ సర్కార్ కు కోర్టుల నుంచి చివాట్లు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు.