తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. అందుకే ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలనే దించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్ నేతలనూ పక్కన పెట్టే అవకాశాలున్నాయి. అంతే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చే కీలక నాయకుల కోసం సొంత పార్టీ నేతలకూ టికెట్ ఇవ్వని పరిస్థితి తలెత్తనుంది. ఈ నేపథ్యంలో నాయకుల్లో సహజంగానే పార్టీపై అసంత్రుప్తి కలుగుతోంది. ఈ అసంత్రుప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం, టీపీసీసీ రంగంలోకి దిగాయనే చెప్పాలి.
వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నాయకులకు కచ్చితంగా టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది. ఆయా స్థానాల్లో టికెట్ దక్కని కీలక నేతలకు అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామనే హామీలిస్తూ పార్టీ సాగుతోంది. జనగామ నుంచి పోటీ చేసేందుకు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ కొమ్మూరి ప్రతాపరెడ్డికే కాంగ్రెస్ టికెట్ ఇచ్చే ఆస్కారముంది. గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోట చేసి ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ ఈ సారి హుస్నాబాద్ నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు. కానీ ఆయనకు ఇక్కడ టికెట్ దక్కే అవకాశం లేదనే చెప్పాలి.
మరోవైపు నాగర్ కర్నూల్ టికెట్ కోసం నాగం జనార్ధన్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ ఇక్కడ ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డికే టికెట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనార్ధన్ రెడ్డితో మాట్లాడి రాజేశ్ కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందని తెలిసింది. మరోవైపు సూర్యపేటలో మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి మధ్య పోటీ ఉంది. ఎల్బీ నగర్ టికెట్ ను మధుయాష్కీ ఆశిస్తుండటంతో ఇక్కడా అలాంటి పరిస్థితే ఉంది. ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని తెలిసింది. మిగతా వాళ్లను హామీలతో బుజ్జగిస్తున్నట్లు సమాచారం.