దేశంలో ఒకప్పుడు ఏకచ్ఛాత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. మోడీ ప్రభతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న ఆ పార్టీ ఆ తర్వాత క్రమంలో ఒక్కో రాష్ట్రంలో వరుసగా అధికారాన్ని కోల్పోతూ వస్తోంది.
ప్రస్తుతం ఛత్తీస్గఢ్, పంజాబ్, రాజస్థాన్లో మాత్రమే సొంతంగా అధికారంలో ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం సహజమే. ఈ విషయాన్నే గ్రహించిన మోడీ ఒక్కో అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు.
ఇక బీజేపీపై వస్తున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని వచ్చే ఎన్నికల్లో తిరిగి గద్దెనెక్కాలని ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు సమర్థంగా లేవనే చెప్పాలి. సరైన నాయకత్వం లేని పార్టీ ప్రణాళికల విషయంలో వ్యూహాలు రచించడంలో విఫలమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశాజనక ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఆయన చెప్పారు. పార్టీ 300కు పైగా లోక్సభ స్థానాల్లు గెలవడం కష్టమేనని ఆయన పేర్కొన్నారు. ఓ వైపు వచ్చే ఏడాది జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు పార్టీ యువ నాయకత్వం కష్టపడుతోంది.
ముఖ్యంగా యూపీలో పార్టీ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్న ప్రియాంక గాంధీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాల్సింది పోయి.. ఇలా నిరాశ కలిగించే వ్యాఖ్యలు చేయడం సీనియర్ నాయకులకు తగునా అని టాక్ వినిపిస్తోంది.