చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. సున్నితమైన రాజకీయ రంగంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదు. నెల రోజుల వ్యవధిలో మారిన వాతావరణం గులాబీ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. నోటి మాటగా మొదలైన కాంగ్రెస్ గాలి మాట.. ఇప్పుడో తుపానుగా మారటమే కాదు.. అంత పెద్ద గులాబీ పార్టీకి నిద్ర పోనివ్వని రీతిలో మారటం హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన గులాబీ పార్టీ తొలిసారి గజగజా వణికే పరిస్థితి. నోటి మాటల్లో తప్పించి.. ఎక్కడా నిరూపణ కాని కాంగ్రెస్ గాలి విషయంలో తెలంగాణ అధికార పక్షం ఇప్పుడు ఆగమాగం అవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పటివరకుపలు సంస్థలు చేపట్టిన సర్వేల్లోనూ కాంగ్రెస్ గాలి లెక్కలు అంకెల రూపంలో కనిపించింది లేదు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలతో ప్రైవేటుగా మాట్లాడే వేళలోనూ కాంగ్రెస్ గాలి గురించి విన్నామే కానీ తమకు విషయం తెలీదని చెప్పటం కనిపిస్తుంది.
అదే సమయంలో గులాబీ పార్టీకి చెందిన తోపు నేతలు సైతం ‘కాంగ్రెస్ గాలి’కి సంబంధించి జరుగుతున్న ప్రచారం వారికి కొత్త టెన్షన్ ను తెప్పిస్తోంది. తమను కలిసిన ముఖ్యుల వద్ద మనసు విప్పుతున్న సదరు నేతలు.. అన్నా.. ఈ కాంగ్రెస్ గాలి ఏందంటావ్? అంత గాలి ఎందుకు వచ్చింది? మా సారు చేసిన తప్పేంటి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఎంతగా ఆలోచించినా కాంగ్రెస్ గాలికి ఉన్న లాజిక్ తమకు బోధ పడటం లేదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మినహాయిస్తే.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటన్న దానిపై మెజార్టీ గులాబీ నేతల నోటి నుంచి వస్తున్న ఆఫ్ ద రికార్డు మాట ఏమంటే.. మా ప్రభుత్వానికి అహంకారం ఎక్కువైందన్నా అంటూ చెప్పుకొస్తున్నారు. పని చేసిన ప్రభుత్వానికి రవ్వంత అహంకారం పెద్ద సమస్య కాదని తాము భావించామని.. కానీ ఇప్పుడదే తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని చెప్పటం గమనార్హం.
భారీగా సంక్షేమ పథకాల్ని అమలు చేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి వాతావరణం ఏర్పడటం ఏమిటి? అన్నది వారిని వేధిస్తోంది. తాజాగా జరుగుతున్న ఎన్నికల వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఇద్దరు కలిసినా.. తెలంగాణలో వీస్తున్న కాంగ్రెస్ గాలి చర్చకు రావటమే కాదు.. దానికి కారణాలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారిందని చెప్పక తప్పదు.