హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్లో రోజంతా సమావేశమై తెలంగాణా కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటి జాబితాను సిద్ధంచేసింది. రాబోయే ఎన్నికల్లో పోటీచేయాల్సిన అభ్యర్ధుల జాబితాపై కసరత్తు చేయటానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొదట ప్రదేశ్ ఎన్నికల కమిటి సమావేశమైన విషయం తెలిసిందే. 119 నియోజకవర్గాలకు 1220 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతపెద్ద జాబితాను ప్రదేశ్ ఎన్నికల కమిటి కుదించింది. ఆ కుదించిన జాబితాపై హోటల్లో సమావేశమైన స్క్రీనింగ్ కమిటి చర్చించింది.
ఒక్కో స్ధానానికి 3 పేర్లను ఎంపికచేసింది. అలాగే 30 నియోజకవర్గాల్లో ఒక్కపేరును మాత్రమే ఫైనల్ చేసింది. జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులతో కూడా స్క్రీనింగ్ కమిటి చర్చలు జరిపి ఆశాహుల నేపధ్యంపై అభిప్రాయాలు తీసుకుంది. స్క్రీనింగ్ కమిటి సమావేశంలో బీసీలకు, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటి వడబోసి రెడీచేసిన జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటికి పంపటానికి ఢిల్లీకి పంపబోతోంది.
ఈనెల 25 తర్వాత ఎప్పుడైనా అభ్యర్ధుల ప్రకటన ఉండచ్చని పార్టీవర్గాలు చెప్పాయి. మొదటిజాబితాలో బహుశా 30 నియోజకవర్గాలు ఉండచ్చు. ఒక్కో పేరుమాత్రమే వచ్చిన 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలున్నాయి. అభ్యుర్ధుల జాబితాపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని తెలంగాణా ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే చెప్పారు. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని మరో ఒకటి, రెండు సమావేశాల తర్వాత కానీ అభ్యర్ధులపై స్పష్టత రాదన్నారు.
తదుపరి సమావేశాలు ఢిల్లీలో ఉండచ్చని పార్టీవర్గాలు చెప్పాయి. మొత్తంమీద ప్రకటించబోయే అభ్యర్ధుల విషయంలో కాంగ్రెస్ చాలా జాగ్రత్తలే తీసుకుంటోందని అర్ధమవుతోంది. కొన్ని నియోజకవర్గాలను పెండింగులో పెట్టే అవకాశముంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం, కొత్తగూడెం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు కాంగ్రెస్ తరపున పోటీచేస్తారనే ప్రచారం విపరీతంగా ఉంది. అయితే వీళ్ళిద్దరు పార్టీలో చేరలేదు. ఇలాంటి నియోజకవర్గాలు మరికొన్ని ఉండచ్చని అధిష్టానం అంచనా వేస్తోంది. అందుకనే ఈనెలాఖరు వరకు సమయం తీసుకుంటున్నది. మరి ఈలోగానే తుమ్మల, జలగం లాంటి నేతల భవిష్యత్తు తేలిపోతుందా?