ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ వేసుకున్న ఖరీదైన టీషర్టుపై కాషాయ నేతలు చేసిన కామెంట్లు కాక రేపాయి. అంతేకాదు, ఖరీదైన విదేశీ బ్రాండ్ టీ షర్ట్ ధరించిన రాహుల్ బాబా…భారత్ జోడో అంటూ యాత్ర చేస్తున్నారని కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది.
దీంతో, ఆ కామెంట్లుకు కాంగ్రెస్ నేతలు కూడా దీటుగానే బదులిస్తున్నారు. రాహుల్ టీ షర్ట్ గురించి మాట్లాడాలంటే ప్రధాన మోడీ వేసుకున్న సూటు, బూటుల గురించి కూడా మాట్లాడదామంటూ చురకలంటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమిత్ షా కామెంట్లకు కౌంటర్ గా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఓ ఫోటో రాజకీయ దుమారం రేపుతోంది. ఆర్ఎస్ఎస్ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను కాంగ్రెస్ ట్వీట్ చేయడంతో అది వైరల్ అయింది.
” విద్వేష సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించి, ఆర్ఎస్ఎస్-బీజేపీ చేస్తోన్న నష్టాన్ని పూరించేందుకు దశల వారీగా మా లక్ష్యాన్ని చేరుకుంటాం…అందుకు ఇంకా 145 రోజులు మిగిలి ఉంది’’ అంటూ కాంగ్రెస్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. అయితే, ఈ ట్వీట్ ను కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు షేర్, సర్క్యులేట్ చేయడంతో అది ట్రెండింగ్ లో ఉంది. దీంతో, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోపై బీజేపీ మండిపడుతోంది.
ఆ ఫోటోను వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ.. దేశంలో హింసను కోరుకుంటున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రశ్నించారు. రాహుల్ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర అని సెటైర్లు వేశారు. మరి, బీజేపీ డిమాండ్ కు తలొగ్గి ఆ ట్వీట్ ను తొలగిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.