ఏపీలో కాంగ్రెస్ అంటే.. ఒకప్పుడు గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు బలంగా ఉంది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత కూసాలు కదిలిపోయినట్టుగా పార్టీ పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక్కడ పార్టీ గత రెండు ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది.
2014, 19 ఎన్నికల్లో పార్టీ ఓటమి బాధ్యతలను స్వీకరిస్తూ.. రఘువీరారెడ్డి పార్టికి దూరంగా ఉన్నారు. దరిమిలా సాకే శైలజానాథ్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే, సాకే కూడా.. చేసింది ఏమీ కనిపించలేదు. ఏదో గుర్తుకు వచ్చినప్పుడు.. మీడియా ముందుకు రావడం తప్ప.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నం చేయలేదు.
కీలకమైన రాజధాని అంశంలో రాహుల్ ఎంతో కీలక ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. హోదా ఇస్తామని చెబుతున్నారు. అయినా.. కూడా సాకే ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేక పోయారు. దీంతో పార్టీ ఎక్కడికక్కడ.. మరింత పాతాళానికి దిగజారిపోయిన పరిస్థితి కనిపించింది.
దీంతో ఎట్టకేలకు.. పార్టీ అధిష్టానం.. పీసీసీ చీఫ్ ను మార్చేసింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన గిడుగు రుద్రరాజు.. ఏఐసీసీ కార్యదర్శిగా, ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్చార్జిగా పనిచేశారు. గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన ఆయన యువ నేతగా, విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్లో రాణించారు. గిడుగు రుద్రరాజుకు అనేక మంది సీనియర్ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది.
ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గిడుగు నియామకం జరిగినట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే, ఆయన పేరు ప్రజలకు పెద్దగా తెలియక పోవడం గమనార్హం. అదేవిధంగా రాష్ట్రంలో మరో 18 మంది సీనియర్ నాయకులో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.
మరో 34 మందితో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పీ రాకేష్, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్గా మాజీ పార్లమెంటు సభ్యులు జీవీ హర్షకుమార్, మీడియా కమిటీ చైర్మన్గా తులసిరెడ్డిలను నియమించింది.
కానీ, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిపేరును పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. విభజనకు వ్యతిరేకంగా ఆయన పార్టీ నుంచి వచ్చి.. సమైక్య పార్టీ పెట్టుకున్నారు. ఇది ఫెయిల్ అయ్యాక.. మళ్లీ కాంగ్రెస్లోకివెళ్లారు. కానీ, ఇప్పటికీ ఆయన పార్టీ తరఫున ఎక్కడా కనిపించడం లేదు. మరి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం.. ఆయనను పక్కన పెట్టిందా? అనే చర్చ జరుగుతోంది.
ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గిడుగు రుద్రరాజు గారికి కార్య నిర్వాహక అధ్యక్షులుగా @MastanValiINC @GouthamJanga @SunkaraPadmasri @Rakeshapyc గార్లకు శుభాకాంక్షలు pic.twitter.com/kmPMICmjQO
— INC Andhra Pradesh (@INC_Andhra) November 23, 2022