హైదరాబాద్ లో ఈనెల 17వ తేదీన కాంగ్రెస్ నిర్వహించబోయే విజయభేరి బహిరంగ సభ చాలా కీలకమైనదిగా సీనియర్లందరూ భావిస్తున్నారు. ప్రత్యేకంగా సోనియాగాంధీ పాల్గొనబోతున్న ఈ సభలో కాంగ్రెస్ పార్టీ తరపున ఐదు గ్యారెంటీల ను ప్రకటించబోతున్నారు. ఈ ఐదు గ్యారెంటీ హామీల అమలుకు డెడ్ లైన్ ను కూడా సోనియా ప్రకటించబోతున్నారు. ఇంతకీ డెడ్ లైన్ ఏమిటంటే 100 రోజులట. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని సోనియా గ్యారెంటీ ఇవ్వబోతున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో ఐదు గ్యారెంటీ హామీల అమలుకు పార్టీ 100 రోజుల గడువును ప్రకటించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా ఇదే విషయమై మాట్లాడుతూ పార్టీ ప్రకటించిన ఐదు గ్యరెంటీల్లో నాలుగింటిని 100 రోజుల్లోపే అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. మిగిలిన హామీని కూడా వీలైనంత తొందరలోనే అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. సేమ్ టు సేమ్ అదే పద్ధతిలో తెలంగాణాలో కూడా 100 రోజుల డెడ్ లైన్ విధించుకోబోతున్నది పార్టీ.
ప్రజల్లో పార్టీపైన నమ్మకం కలగాలంటే ఏదో గట్టి హామీని ఇస్తేకానీ నమ్మరన్నది సీనియర్లలో చాలామంది అభిప్రాయం. అందుకనే కర్నాటక తరహాలోనే ఐదుగ్యారెంటీలపై పెద్దఎత్తున కసరత్తు జరుగుతోంది. సీనియర్, పలువురు వృత్తి నిపుణులు, వివిధ రంగాల్లోని మేథువులతో పీసీసీ ముఖ్యలు మంతనాలు జరుపుతున్నారు. హామీ ఏదైనా కావాల్సిన నిధుల సమీకరణ, సేకరణ, కేటాయింపు తదితరాలపై క్షుణ్ణంగా అధ్యయనం జరుగుతోంది.
మొదట్లో ఐదు గ్యారెంటీలతో పాటు మ్యానిఫెస్టోను కూడా సోనియాతోనే ప్రకటింపచేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు అనుకున్నారు. అయితే వివిధ కారణాలతో మ్యానిఫెస్టో ప్రకటనను వాయిదా వేసుకున్నారు. ఒకవైపు ఐదు గ్యారెంటీలపై కసరత్తుకే సమయం సరిపోనప్పుడు మ్యానిఫెస్టోపైన కూడా కసరత్తు చేయాలంటే కష్టమని సీనియర్లలో చాలామంది అభిప్రాయపడ్డారు.
అందుకనే ఏకకాలంలో రెండు కీలకమైన అంశాలపై దృష్టి పెట్టే బదులు ఒకదాని తర్వాత మరొకటి టేకప్ చేద్దామని నిర్ణయించారు. సీడబ్బ్యూసీ మీటింగ్, తెలంగాణా విమోచన దినోత్సవం, బహిరంగసభలో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, నలుగురు ముఖ్యమంత్రులతో పాటు సీనియర్లందరు హైదరాబాద్ కు వచ్చేశారు.