ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. అధ్యక్షుడిగా ఉన్నంత వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు!-ఇదీ గత 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. పలువురుసీనియర్ నాయకులు బహిరంగంగా చేసిన ప్రకటన! ఈ వ్యాఖ్యలకు ఆయన భారీ కౌంటర్ అప్పుడే ఇచ్చారు.
నేను పార్టీని గాడిలో పెడతాను. టీఆర్ ఎస్‌కు చుక్కలు చూపిస్తాను. యువతను సమీకరిస్తాను. పార్టీని పరుగులు పెట్టిస్తాను.. అన్నారు. ఇది జరిగి 23 నెలలు అయింది. అయితే. ఇప్పటి వరకు కాంగ్రెస్ పుంజుకోక పోగా.. ఉన్న నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెబుతుండగా… మరోవైపు కాంగ్రెస్ ప్లేస్‌ను బీజేపీ భారీగా భర్తీ చేస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ వెంటనే వచ్చిన 2014 ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన కార్యాచరణ ప్రారంభించారు. కానీ, పొత్తులు కలిసిరాలేదు. సరికదా.. సీనియర్లు సైతం ఆయన వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. ఆయన సతీమణికి కూడా టికెట్ ఇచ్చుకోవడం ఏంటనే విమర్శలువచ్చాయి. ఇక, 2018లో అయినా.. పార్టీని అధికారంలోకి తెస్తారని అనుకున్నారు. అనేక వ్యూహాలు, ప్రతివ్యూహాలు వేసి.. చివరకు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. విజయం ఖాయమని భావించి.. ఆదిశగా కూడా అడుగులు వేశారు.
అయినా.. ఫలితం మాత్రం జీరోనే! ఇక, ఇప్పుడు దుబ్బాక ఫలితం మరింత దారుణం. కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత గా చతికిల పడిపోయాడు. మరిదీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అనే విషయంపై పోస్ట్ మార్టమ్ జరుగుతోంది. ఇదిలావుంటే.. పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్న విజయశాంతి రేపో మాపో. పార్టీ మారిపోవడం ఖాయంగా తేలిపోయింది. యువతను సమీకరించలేక పోయారు. సీనియర్ల సలహాలను స్వీకరించే ఓపిక, సాహసం కూడా చేయలేక పోయారు. అనేక మంది నాయకులు టీఆర్ ఎస్‌లో చేరి పోతే.. చేష్టలుడిగి చూస్తూ కూర్చున్నారు.
ఇలా.. అన్ని విధాలా పార్టీని భ్రష్టు పట్టించిన చరిత్రను ఉత్తమ్ కుమార్ సొంతం చేసుకున్నారనేవారే తప్ప.. ఒక్కరు కూడా ఇప్పుడు ఆయనను సమర్ధించక పోవడం గమనార్హం. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. బీజేపీ గెలవడం! అదే టీఆర్ ఎస్ గెలిచి ఉంటే.. సింపతీ ఓట్లు పడ్డాయి. మాతప్పు కాదని ఉత్తమ్ తప్పుకొనేందుకు ఛాన్స్ ఉండేది. కానీ, పరిస్థితి ఫుల్ రివర్స్ అయింది. మొత్తానికి ఆయన స్వయంగా తప్పుకొంటే.. కొంతైనా పరపతి నిలుస్తుందని.. లేదంటే.. అది కూడా పోతుందని సీనియర్లు అప్పుడే గుసగుసలాడుతుండడం ఉత్తమ్ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.