తెలంగాణ అసెంబ్లీ ఫలితాలలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం తమకు అనుకూలంగా వస్తాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడంతో పాటు సర్వే సంస్థలపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా కేటీఆర్ కు షాక్ ఇస్తూ దాదాపుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కౌంటింగ్ పూర్తయిన రౌండ్ల ప్రకారం కాంగ్రెస్ పార్టీ దాదాపు 65 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీఆర్ఎస్ 42 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటివరకు రెండు ఫలితాలు వెలువడగా అశ్వరావుపేట, ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఇక, మరో ప్రధాన పార్టీగా బరిలోకి దిగిన బిజెపి కేవలం 8 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా కాంగ్రెస్ గెలుపు ఖాయం అయిందని రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతల సందడి మొదలైంది. మరోవైపు, సీఎం కేసీఆర్ కు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి షాకిచ్చేలా కనిపిస్తున్నారు. కొడంగల్ లో దాదాపు 14 వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్న రేవంత్ రెడ్డి కామారెడ్డిలోనూ నాలుగువేలకుపైగా మెజార్టీతో దూసుకుపోతున్నారు. గజ్వేల్ లో కూడా కేసీఆర్ 1000 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే కొనసాగుతూ ఉండటం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతోంది.
అయితే, సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు మాత్రం భారీ మెజారిటీతో ఆదిత్యంలో కొనసాగుతూ ఉండటం ఆ పార్టీ శ్రేణులకు ఊరటనిస్తోంది. ఇక, బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచిన ఎంఐఎం కూడా ఈసారి నాలుగు నుంచి ఐదు స్థానాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అద్భుతాలు జరిగితే తప్ప దాదాపుగా కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు కచ్చితంగా 65 పై చిలుకు స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. రాజాసింగ్ మినహా ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి కీలక నేతలు వెనుకంజలో ఉండటం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే, బీఆర్ఎస్, బిజెపి ఒకటేనని ప్రజల్లో ప్రచారం జరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పడిందని, అందుకే బిజెపికి స్థానాలు తగ్గాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.