అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు వైసీపీ మినహా ఏపీలోని విపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాదయాత్రకు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా సంఘీభావం తెలిపారు. పాదయాత్రకు సంఘీభావం ప్రకటించేందుకు ఖమ్మం జిల్లా నుంచి విజయవాడ బయలుదేరిన రేణుకా చౌదరికి చేదు అనుభవం ఎదురైంది.
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద రేణుకా చౌదరికి కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. శాలువాతో ఆమెను సత్కరించిన కాంగ్రెస్ నేతలు…రోడ్డుపై రేణుకకు హారతివ్వబోయారు. అయితే, కార్యకర్తలను వారించిన పోలీసులు…హారతి, స్వాగతం పలకడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. ఇబ్రహీంపట్నం రింగ్‌లో కూడా కాంగ్రెస్ జెండాలను పోలీసులు తొలగించారు. అంతేకాదు, రోడ్డుపైకి వస్తే అరెస్ట్ చేస్తామంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అమరావతి రైతుల పాదయాత్ర, జగన్ సర్కార్ పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు దేశానికి వెన్నెముక అని, అలాంటి రైతులను జగన్ ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందని రేణుక దుయ్యబట్టారు. పాదయాత్రకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని రేణుక ఆరోపించారు. తానో సైనికుడి కూతురినని, దేశంలో ఎక్కడైనా పర్యటిస్తానని, తనకు భయం అంటే ఏంటో తెలియదని అన్నారు.
అమరావతి ఉద్యమంలో మహిళల పాత్రను రేణుక ప్రశసించారు. మహిళల చేతులకు ఉన్నవి గాజులు కావని, విష్ణు చక్రాలని అన్నారు. మహిళలు ఓటుతో జగన్ సర్కారుకు బుద్ధి చెబుతారని రేణుక జోస్యం చెప్పారు. అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎపుడు మద్దతుగా ఉంటుందన్నారు.