రాజకీయ మేరునగం ఒరిగిపోయింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్న ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం తెల్లవారు జామున హైదరాబాద్లోని స్వగృహంలో ఆయన కన్ను మూశారు. గత ఐదేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఒకా నొక దశలో ఆయన వ్యక్తిగత సహాయకుడు లేకుండా నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. అనారోగ్యంతో పాటు హృద్రోగ సమస్యలు కూడా ఎదురు కావడంతో ధర్మపురి శ్రీనివాస్ ఈశుక్రవారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు.
1948, సెప్టెంబరు 27న నిజామా బాద్ జిల్లాలో జన్మించిన శ్రీనివాస్.. యుక్త వయసు నుంచే నాయకుడిగా ఎదిగారు. విద్యార్థి సంఘం నేతగా.. ఆయన రాణించారు. అనంతర కాలంలో నిజాం కళాశాల నుంచి పట్టభద్రుడు అయినా.. ఆయన మనసంతా రాజకీయాల చుట్టూనే తిరిగింది. ఈ సమయంలో ఆయనకు టీడీపీ నుంచి తొలి ఆహ్వానం అందింది. అయితే.. అప్పటికే రాజకీయాల్లోఉన్న మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సూచనలతో .. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. కాంగ్రెస్లో చేరు అన్న ఆయన దిశానిర్దేశంతో కాంగ్రెస్ బాట పట్టారు.
అప్పటి నుంచి రాష్ట్ర విభజన వరకు కూడా.. ఆయన ఆ పార్టీలోనే కొనసాగారు. అనేక ఉత్థాన పతనాలను చవిచూశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులకు అత్యంత ప్రియమైన నాయకుడిగా ఉన్నారు. ముఖ్యంగా కాసు బ్రహ్మానందరెడ్డి.. రా.. శ్రీనివాస్! అంటూ.. ఆప్యాయంగా పిలుచుకునే స్థాయికి ఎదిగారు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్తిగా ఎలివేట్ కావడంతోనూ ధర్మపురి శ్రీనివాస్ క్రియాశీలక పాత్ర పోషించారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ను అదుపు తప్పకుండా.. పదేళ్ల పాటు నడిపించారు.
మంత్రిగా, పార్టీ పీసీసీచీఫ్గా అనేక హోదాలు అనుభవించిన ఆయన.. చివరి దశలో మాత్రం కేసీఆర్ పట్ల ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ విధానాల్లో మార్పు రావాలని అభిలషించిన ఆయన.. ఆ మార్పు రాకపోవడంతో తానే మారిపోయానని.. నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. ఎవరికి భయపడని నాయకుడిగా.. ఏ సమస్యనైనా ఎదిరించే నేతగా ధర్మపురి ప్రస్థానం చిరస్థాయి. తెలంగాణ రాజకీయాల్లో ఆయన వేసిన అడుగులు అనన్య సామాన్యమనే చెప్పాలి. తన కుమారులను ఇద్దరినీ.. ఆయన రాజకీయ బాట పట్టించిన విషయం తెలిసిందే.