దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఒక అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. శాసనసభ బరిలో దిగే అభ్యర్థులు మొదలు… సీఎం అభ్యర్థి ఎంపిక వరకు ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీ హైకమాండ్, పెద్దలు మాత్రమే తీసుకోగలరు అన్న అపవాదు ఆ పార్టీ మీద మీద ఉంది. దానికి తోడు గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీగా పేరుపొందిన కాంగ్రెస్ కు నాన్చుడు ధోరణి ఎక్కువ అని, అదే ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం సునిశితమైన విమర్శలు చేస్తుంటారు.
అయితే, చాలా వరకు ఆ అపప్రదను తొలగించుకునేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఈ మధ్యకాలంలో కొన్ని నిర్ణయాలను యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటోంది. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన మరుసటి రోజే సీఎల్పీ నేత, సీఎం అభ్యర్థి ఎంపిక, ప్రమాణ స్వీకారం కూడా ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ, ఇంకా ఆ విషయాలలో కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతూనే ఉండడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా, జరిగిన సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేతను కాంగ్రెస్ అభ్యర్థులు ఎంచుకుంటారని, సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తారని అంతా భావించారు.
కానీ, గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులంతా సీఎల్పీ అభ్యర్థి ఎంపిక, సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను హైకమాండ్ కి అప్పగిస్తూ చేతులు దులుపుకున్నారు. దీంతో, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న నిర్ణయం కాంగ్రెస్ హై కమాండ్ దే కానుంది. మరో, రెండు మూడు గంటల్లో సీఎల్పీ నేత ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆ బాధ్యత అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ తీర్మానాన్ని ఖర్గేకు డీకే శివకుమార్, ఠాగూర్ పంపించారు.
మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పార్క్ హయత్ హోటల్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. సీఎం రేసులో తాను కూడా ఉన్నానని భట్టి నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక లాంఛనమే అని, మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నారని మీడియాలో ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.